తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఘనంగా జరిగిన “ప్రపంచ జానపద దినోత్సవం”

తణుకు, ఆగస్టు 22, 2026 : కనుమరుగవుతున్న జానపద కళలను కాపాడుకుని మన సాంస్కృతిక వైభవాన్ని తరువాతి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు, ప్రముఖ టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గీత రచయిత కోట రామ ప్రసాద్ ఆహూతులకు పిలుపునిచ్చారు.

“ప్రపంచ జానపద దినోత్సవం” సందర్భంగా శనివారం సాయంత్రం తణుకు బ్యాంక్ కాలనీలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఘనంగా జరిగిన సభలో కోట రామ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సభాసదులకు ముందుగా సంఘ కార్యదర్శి మహమ్మద్ స్వాలీహా స్వాగతం పలికారు. సభకు సంఘ ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకటేశ్వర రావు (వెంకన్న) అధ్యక్షత వహించారు.

కోట రామ ప్రసాద్ ఇంకా మాట్లాడుతూ, డెబ్భై ఏళ్ళ క్రితం 1955 వ సంవత్సరంలో విడుదలైన “రోజులు మారాయి” చిత్రంలోని “ఏరువాక సాగారో రన్నా చిన్నన్న” అనే జానపద గేయం ఇవాళ్టికీ మన హృదయాలను రంజింపజేస్తున్నదని గుర్తుచేశారు. కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాసిన గీతాన్ని జిక్కి కృష్ణవేణి గానం చేయగా, ఈ గీతానికి “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు” గ్రహీత వహీదా రెహమాన్ అద్భుత నటన ప్రదర్శించారని కొనియాడారు. హరికథ, బుర్ర కథ, ఒగ్గు కథ, తోలు బొమ్మలాట, బుట్ట బొమ్మలాట, కోలాటం, గిరిజనులు చేసే థింసా నృత్యం వంటి జానపద కళలు, కొండపల్లి బొమ్మలు వంటి ఆటవస్తువుల తయారీ లాంటి హస్త కళలను కూడా కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. జానపద కళాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింఛనులు ఇచ్చి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

సభాధ్యక్షులు నల్లజర్ల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, జానపద కళలైన హరికథ, బుర్రకథ, కోలాటం వంటి వాటిని ప్రోత్సహించాలని కోరారు. సంఘ ఉపాధ్యక్షులు కోడూరి ఆంజనేయులు మాట్లాడుతూ, జానపద కళలను మనం సంరక్షించుకోవాలనీ, ఆ కళాకారులను గౌరవించాలని కోరారు.

ఈ సందర్భంగా టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రామ ప్రసాద్ ను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకటేశ్వర రావు (వెంకన్న), కార్యదర్శి మహమ్మద్ స్వాలీహా, మరో ఉపాధ్యక్షులు కోడూరి ఆంజనేయులు, వడ్లమాని పార్వతి ప్రభృతులు దుశ్శాలువా, కుండీ మొక్కతో ఘనంగా సత్కరించారు. తనకు జరిగిన సన్మానానికి కోట రామ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆకుల వెంకటేశ్వర రావు, కోశాధికారి అర్జి భాస్కరరావు, సభ్యులు బోడపాటి ప్రసాద్, నాదెళ్ళ కృష్ణానందం, శిరిగినీడి రామకృష్ణారావు, యం. వెంకట రెడ్డి, పరిమి సూర్యనారాయణ, గిరిజాల నాగేశ్వర రావు ప్రభృతులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link