కానూరులో వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
జనసేన నాయకుడు కోలా సీతయ్య నాయుడు ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ విద్యార్థినుల సమక్షంలో కేక్ కట్ చేసి, పరుపులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో జనసేన నాయకుడు కోలా సీతయ్య నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ హాస్టల్ విద్యార్థినుల సమక్షంలో మంత్రి దుర్గేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు పరుపులు వితరణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టిన కోలా సీతయ్య నాయుడిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… “గతంలో పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన టాయిలెట్స్ లేకపోవడం వల్లే విద్యార్థినులు చదువుకు దూరమవుతున్నారని (డ్రాప్ అవుట్స్) పలు నివేదికలు స్పష్టం చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఉచితంగా యూనిఫారాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యేకించి నిడదవోలులో ‘నెస్లే’ కంపెనీ సౌజన్యంతో బయో టాయిలెట్లు ఏర్పాటు చేసి, విద్యార్థినులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించామని అని వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కానూరు గ్రామ సమగ్రాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. గత ప్రభుత్వం రోడ్లకు కనీస మరమ్మత్తులు కూడా చేయలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారుల పునర్నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ సమర్థ నిర్వహణ వల్లే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని కొనియాడారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ‘జల్ జీవన్ మిషన్’ నిధులతో ‘అమరజీవి జలధార’ పథకానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వైద్యం కోసం పడే ఇబ్బందులను గుర్తించి రహదారుల సౌకర్యం కల్పించిన ఘనత డిప్యూటీ సీఎంకే దక్కుతుందన్నారు. రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించి ‘పల్లె పండుగ 1, 2’ ద్వారా గ్రామీణాభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో యువతలో నాయకత్వ పటిమను పెంచేందుకు ‘జై కొట్టు’ పేరుతో జనసేన రాష్ట్ర యువజన విభాగాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. సుపరిపాలన అందిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వానికి, కూటమి ప్రభుత్వానికి జైకొట్టి యువత, ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
గ్రామస్తులు అందజేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన మంత్రి దుర్గేష్ కానూరు గ్రామాన్ని మరిన్ని నిధులతో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




