- థలసేమియా, సికిల్ సెల్ అనీమియాపై పూర్తి విజయం సాధ్యమేనన్న ప్రముఖ హెమటో ఆంకాలజిస్ట్ అశోక్ కుమార్
- మూలకణ మార్పిడి (బోన్ మ్యారో) చికిత్సలో రికార్డు స్థాయిలో 475కు పైగా విజయవంతమైన ఆపరేషన్లు
- ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి చిన్నారులకు సంపూర్ణ విముక్తి
- రక్తహీనత, తరచుగా జ్వరం వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని తల్లిదండ్రులకు హెచ్చరిక
- ప్రజల చెంతకే యశోద ఆసుపత్రి అధునాతన సేవలు.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
తణుకు :
చిన్నారుల పాలిట శాపంగా మారుతున్న థలసేమియా, సికిల్ సెల్ అనీమియా లాంటి తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్యవిధానమైన మూలకణ మార్పిడితో (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్) పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని దేశంలోనే అగ్రగామి హెమటో ఆంకాలజిస్ట్, సోమాజిగూడ యశోద ఆసుపత్రి సీనియర్ వైద్యుడు అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వైద్యరంగంలో తనదైన ముద్ర వేస్తూ, అత్యంత క్లిష్టమైన కేసులను సైతం సునాయాసంగా ఛేదించే అశోక్ కుమార్.. ఇప్పటి వరకు 475 కు పైగా విజయవంతమైన మూలకణ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి అరుదైన రికార్డును నెలకొల్పారు. ఆయన అద్భుతమైన వైద్య నైపుణ్యం ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించింది. రక్త సంబంధిత వ్యాధుల చికిత్సలో ఆయన అందిస్తున్న సేవలు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందాయి.
తణుకులోని చిట్టూరి ఎన్క్లేవ్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక పత్రికా సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వైద్య సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, గతంతో పోలిస్తే మూలకణ మార్పిడి విధానం ఇప్పుడు అత్యంత సురక్షితంగా మారిందని వివరించారు. ముఖ్యంగా సికిల్ సెల్, థలసేమియా వంటివి పిల్లల శారీరక ఎదుగుదలను తీవ్రంగా దెబ్బతీస్తాయని, అయితే వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన వైద్యం అందిస్తే వారు సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితం గడపడం నూటికి నూరు శాతం సాధ్యమని భరోసా ఇచ్చారు. రక్తహీనత, పదేపదే జ్వరం రావడం, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తక్షణమే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. కుటుంబ సభ్యుల్లో కచ్చితంగా సరిపోయే దాత (డోనర్) దొరికితే ఈ చికిత్స విజయవకాశాలు అత్యధికంగా ఉంటాయని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అత్యాధునిక కార్పొరేట్ వైద్య సేవలను సామాన్యులకు సైతం చేరువ చేయాలనే ఉత్కృష్టమైన లక్ష్యంతో యశోద ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఏలూరు, తణుకు పట్టణాల్లోనూ.. అలాగే రెండవ బుధవారం కాకినాడ, రాజమండ్రి నగరాల్లోనూ నిపుణులైన వైద్యులతో ప్రత్యేక శిబిరాలు అందుబాటులో ఉంచుతున్నట్లు అశోక్ కుమార్ వెల్లడించారు. గోదావరి జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పత్రికా సమావేశంలో యశోద ఆసుపత్రి ప్రతినిధులు వెంకటేశ్వర రావు వీరంకి, నల్లం బాల వీరభద్రం, ప్రవీణ్ అబ్బథాసరి తదితరులు పాల్గొన్నారు.




