గోదావరి జిల్లాల భాగ్యవిధాత, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్:మంత్రి దుర్గేష్
223వ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా స్మరించుకున్న మంత్రి దుర్గేష్
నిడదవోలు: గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి, కోటి ఎకరాల మాగాణానికి జీవనాడిని అందించిన నిస్వార్థ ప్రజా సేవకుడు, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాటన్ దొర సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… గోదావరి డెల్టాకు జీవం పోసి, ఈ ప్రాంత రైతాంగానికి నూతన దిశానిర్దేశం చేసిన మహోన్నత దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ అని అభివర్ణించారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వంతో పోరాడి, వారిని ఒప్పించి.. ఇక్కడి ఆంధ్రుల హృదయాలను మెప్పించిన గొప్ప నాయకుడు ఆయన అని కొనియాడారు.
రాజమహేంద్రవరం సమీపంలోని ధవలేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన ఆనకట్టను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల క్రితం ఆయన చూపిన చొరవ వల్లే నేడు లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతోందని, నాటి ఆయన కృషి నేటికీ కోట్లాది మందికి జీవనాధారంగా నిలిచిందని అన్నారు. ఒక బ్రిటీష్ అధికారి అయ్యుండి కూడా స్థానిక ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన కాటన్ దొరను తెలుగు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టుకున్నారని తెలిపారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకోవడమే ఆయన గొప్పతనానికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.




