హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి 116వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ సమీపంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం: తెలుగు వెండితెరపై నవ్వులను పూయించడమే కాకుండా, హాస్య నటుడిగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర కథానాయకులతో సమానమైన స్టార్ డమ్ ను పొందిన హాస్య నటచక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్ట్ 13వ తేదీన రేలంగి వెంకట్రామయ్య 116వ జయంతి వేడుకలను పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ సమీపంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ “నవ్వుల రేడు రేలంగి వెంకట్రామయ్యని ప్రత్యక్షంగా చూడకపోయినా, ఆయన నటించిన అద్భుతమైన చిత్రాల ద్వారా ఆయన నటనా చాతుర్యాన్ని మనమందరం ఆస్వాదిస్తూనే ఉన్నాం. కేవలం హావభావాలతోనే కాకుండా తన విలక్షణమైన గొంతు, నడక, నవ్వులతో పాత్రకు ప్రాణం పోసి, ప్రేక్షక లోకాన్ని సమ్మోహితం చేసిన అభినయ తపస్వి, పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన మహానటుడు రేలంగి వెంకట్రామయ్య. ఇటువంటి మహోన్నత నటుడు మన ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, తనదైన నటన ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి చెరగని నవ్వుల సంతకం చేసిన యుగపురుషుడు.. శెట్టిబలిజ సంఘ నాయకులు, అభిమానులు మరియు ప్రేక్షకులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా హాస్యనట సామ్రాట్ రేలంగి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం” అని పేర్కొన్నారు. తెలుగు సినిమా హాస్యానికి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య మకుటం లేని మహారాజు అని కీర్తిస్తూ కార్యక్రమం అనంతరం “జోహార్ రేలంగి వెంకట్రామయ్య” అంటూ మంత్రి దుర్గేష్ నినదించారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘ నాయకులు, రేలంగి అభిమానులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు




