తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
ఎస్సీ బాలికల వసతి గృహంలో దుప్పట్లు పంపిణీ
మహిళలకు చదువు ఆయుధం అని, చదువుతోనే భవిష్యత్తులో జీవన ప్రమాణాలు మెరుగు అవుతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తణుకు ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్.వి.అరుణ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు.తల్లిదండ్రులు, కుటుంబాలతో సంబంధం లేకుండా స్వశక్తితో అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఉన్నత చదువులు చదువుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు చదువు ఒక ఆయుధంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఒక తరం చదువుకోవడం ద్వారా పది తరాలు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు నేపథ్యంలో చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కనీసం డిగ్రీ, పీజీ వరకు చదువుకొని తద్వారా భవిష్యత్తులో రాబోయే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో కూటమి ప్రభుత్వం వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. తణుకులోని ఎస్సీ బాలికల వసతి గృహంలో లక్ష్యానికి మించి 107 మంది విద్యార్థులు వసతి పొందడం అభినందనీయమని అన్నారు. 2022లో కేవలం 28 మంది విద్యార్థులతో ఉండే ఈ వసతి గృహంలో ప్రస్తుతం ‘నో వేకెన్సీ’ బోర్డు పెట్టడం ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులకు నిదర్శనం అని అన్నారు. మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయని వాటన్నింటినీ అందుకుచ్చుకొని లక్ష్యం అనుగుణంగా ప్రతి ఒక్కరూ చదువును నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ వసతి గృహం వార్డెన్ ఎం.కమల కుమారి, డివిఎంసి సభ్యులు వి.ఆశాజ్యోతి, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




