అభినవ రాబిన్ హుడ్ వంగవీటి రంగా – మంత్రి కందుల దుర్గేష్

కానూరు అగ్రహారంలో శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు

శాంతి కపోతాలు ఎగురవేసి, వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ

నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో శ్రీ కృష్ణదేవరాయ కాపు ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, పేదల బాంధవుడు వంగవీటి మోహన రంగాల విగ్రహావిష్కరణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరై, విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం శాంతికి ప్రతీకగా శాంతి కపోతాలను గాల్లోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు.గ్రామానికి విచ్చేసే ప్రజలు, ప్రయాణికులు సేదతీరేలా అద్భుతమైన మండపం ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా గ్రామ నిర్వాహకులు ‘కానూరు అగ్రహారం’ పేరును నిజమైన అర్థంలో సార్థకం చేసుకున్నారని మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…”సాహితి సమరాంగణ సార్వభౌముడిగా, ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చాటిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం అభినందనీయం. ఆనాటి కాలంలోనే సాంకేతికత లేకపోయినా ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన గొప్ప విజన్ ఆయనది. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు శరవేగంగా మంచి నీరు అందిస్తున్నాం.” అన్నారు. అదే విధంగా “కులమతాలకు అతీతంగా పేదవాడికి కష్టం వస్తే ‘నేను ఉన్నాను’ అని నిలబడిన అభినవ రాబిన్ హుడ్ వంగవీటి మోహన రంగా. ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడిచినా, నేటి యువత ‘రంగా అమర్ రహే’ అని స్మరించుకుంటున్నారంటే ఆయన ప్రజాదరణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. రంగా ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాను.”అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

కానూరు అగ్రహార అభివృద్ధికి రూ. 4.40 కోట్లు:

“రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వ హయాంలో రూ. 4.40 కోట్లతో కానూరు అగ్రహారాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశాం. జల్ జీవన్ మిషన్ కింద రూ. 73 లక్షల నిధులతో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనులకు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. రాబోయే సెప్టెంబర్ నాటికి గ్రామంలో నూతన రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. అలాగే హిందూ స్మశాన వాటిక ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటికే పూర్తి చేసిన దళిత కమ్యూనిటీ హాల్‌ తరహాలోనే ఇతర సామాజిక వర్గాలకు కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతాం.” అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో పనిచేయడం గర్వంగా ఉందన్న మంత్రి దుర్గేష్ … డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆదరించిన నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం ప్రజాసేవకుడిగా రుణపడి ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ప్రియ సౌజన్య, పెరవలి మండల టీడీపీ అధ్యక్షులు అతికారి శ్రీను, జనసేన అధ్యక్షులు పిప్పర రవి, జెడ్పీటీసీ రామాంజనేయులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు మరియు వంగవీటి రంగా అభిమానులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link