ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల ప్రాంగణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కఠారి సిద్ధార్థ విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం వీరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎందరో వీరుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్య్రం లభించిందని, దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామని స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదని దేశప్రగతి, సమగ్ర అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వహించాల్సిన నిరంతర సంకల్పమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహిళలందరూ బయటకు వచ్చి చదువుకునే అవకాశం కలిగిందని తణుకు పట్టణంలో ఇంత పెద్ద మహిళా కళాశాలను స్థాపించడం అందరూ గర్వించదగిన విషయమని అన్నారు. దేశాభివృద్ధి లో యువత కీలక పాత్ర పోషించాలని, విద్య, విజ్ఞానం, సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ వంటి రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. జూనియర్ కళాశాలలో ఇటీవల నిర్వహించిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలుపొందిన ప్యానల్ సభ్యులను ముఖ్యఅతిధికి, యాజమాన్యం వారికి కళాశాల ప్రిన్సిపల్ పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్ సెక్రటరీ శ్రీ చిట్టూరి వెంకట కృష్ణారావు, వివేకానంద గ్లోబల్ స్కూల్ సెక్రటరీ శ్రీమతి చిట్టూరి రీనా సాయి, ఎస్. కె.ఎస్.డి విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో, జాతీయ గీతాలతో అందరినీ అలరించారు.




