ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ దేశవ్యాప్త పాదయాత్రలను విజయవంతం చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పెన్మెత్స దుర్గాభవాని
తణుకు,ఆగస్టు 4
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పెన్మెత్స దుర్గాభవాని అన్నారు.
సీపీఐ ఇచ్చిన “బద్లావ్ జరూరీ హై – మార్పు కావాలి” పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు నిర్వహించే దేశవ్యాప్త పాదయాత్రలను జిల్లాలో విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతాంగ సంక్షోభం, కార్మిక హక్కులపై దాడులు, రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడులను ప్రజలకు వివరించి, ప్రత్యామ్నాయ ప్రజా విధానాల కోసం ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే “ఛలో ఢిల్లీ” మహాధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ మేరకు మంగళవారం తణుకులోని కామ్రేడ్ వంక సత్యనారాయణ సురాజ్య భవన్లో జరిగిన సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యుడు బొద్దాని నాగరాజు అధ్యక్షత వహించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ జిల్లాలో రైతాంగం, ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, గిట్టుబాటు ధరలు, ఇళ్ల స్థలాల సమస్యతో పాటు ఇతర ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రలను ప్రజా ఉద్యమాలుగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సికిలే పుష్పకుమారి, కలిశెట్టి వెంకట్రావు, ఎం. సీతారాం ప్రసాద్, మండల నాగేశ్వరరావు, సనపల శ్రీనివాస్ పాల్గొన్నారు.




