ఖండవల్లి అభివృద్ధికి రూ. 3 కోట్ల నిధులు – దశాబ్దాల రైతుల కలను సాకారం చేస్తూ ‘పుంత రోడ్ల’ నిర్మాణం: మంత్రి కందుల దుర్గేష్

‘పల్లె పండుగ 2.0’ కింద ఖండవల్లిలో రూ. 1.09 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో డబ్ల్యూబీఎం రోడ్లు, రూ. 34.10 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పంచాయతీరాజ్ శాఖ నుండి నిడదవోలుకు తొలి ఏడాది రూ. 13 కోట్లు, ‘శాస్కీ’ ద్వారా అత్యధికంగా రూ. 29 కోట్ల నిధులు సాధించామని వెల్లడి..డిప్యూటీ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్

గోదావరి జలాలతో నియోజకవర్గానికి శాశ్వత తాగునీటి పరిష్కారం – జల్ జీవన్ మిషన్ ద్వారా పెరవలి వద్ద ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు శరవేగం

వరి సాగు కంటే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపాలి – రైతాంగానికి మంత్రి దుర్గేష్ పిలుపు

గత ప్రభుత్వంలో రోడ్లు ధ్వంసం.. కూటమి హయాంలో ఊరూరా ప్రధాన రోడ్లు, సీసీ రోడ్లతో పాటు పుంత రోడ్ల నిర్మాణం: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు:గ్రామీణ మౌలిక వసతుల కల్పన మరియు రైతాంగ శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ‘పల్లె పండుగ 2.0’ కింద రూ. 1.09 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన డబ్ల్యూబీఎం (పుంత) రోడ్లను, బీసీ కాలనీ మరియు దుర్గాపురం కాలనీలలో రూ. 34.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి దుర్గేష్ మంగళవారం ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేవలం సీసీ, లింక్ రోడ్లకు పరిమితమైన నిధులను, సన్న, చిన్నకారు రైతులు మరియు వ్యవసాయ కూలీలకు ఉపయోగపడేలా తొలిసారిగా పుంత రోడ్ల నిర్మాణానికి విస్తరించామని అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా రాబోయే రోజుల్లో 100 రకాల పనులను దశలవారీగా చేపడతామని, అందులో పుంత రోడ్లతో సహా అనేక రకాల రోడ్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.పెరవలిలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన ‘జల్ జీవన్ మిషన్’ పనులను పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. విజ్జేశ్వరం వద్ద 500 కేఎల్ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా నీటిని శుద్ధి చేసి అందిస్తామని, పెరవలిలోని ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 17 గ్రామాలకు తాగునీరు అందించనున్నామన్నారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రామమైన ఖండవల్లిని ఇప్పటికే రూ. 3 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రధానంగా ‘పల్లె పండుగ 1.0’ కింద రూ. 73.50 లక్షల పనులు పూర్తి కాగా, రూ. 65.10 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఆమోదం లభించిందన్నారు. రూ. 20 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో రూ. 36 లక్షలతో హెల్త్ సెంటర్ నిర్మించామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు మరో రూ. 3 కోట్లతో స్థానిక చెరువు సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు మరింత అభివృద్ధి చేపడతామన్నారు. మాలకోడు, సమిశ్రగూడెం చెరువులతో పాటు ఖండవల్లి చెరువును కూడా ప్రత్యేకంగా సుందరీకరిస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నిడదవోలు నియోజకవర్గానికి తొలి ఏడాదే పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 13 కోట్లు, అలాగే రాష్ట్రంలోనే అత్యధికంగా ‘శాస్కీ’ నిధుల ద్వారా రూ. 29 కోట్లు తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి:మంత్రి దుర్గేష్

ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతాంగం త్వరితగతిన నాట్లు పూర్తి చేసుకోవాలని, సీఎం చంద్రబాబునాయుడు సూచనలకనుగుణంగా నీటి ఎద్దడి దృష్ట్యా రాబోయే రోజుల్లో వరికి బదులుగా వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలని మంత్రి దుర్గేష్ కోరారు. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా, రైతులు నష్టపోకుండా ఉండేందుకే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలు వేసుకోవాలని, ముందే జాగ్రత్త పడితే నష్ట నివారణ చర్యలు సులువవుతాయని రైతులకు దిశానిర్దేశం చేశారు.

గత ప్రభుత్వం ‘అమ్మఒడి’ పేరుతో కుటుంబంలో ఒక్కరికే లబ్ధి చేకూర్చగా, కూటమి ప్రభుత్వం చదువుకుంటున్న ప్రతీ బిడ్డకు ఏటా రూ. 15,000 అందిస్తోందన్నారు.’అన్నదాత సుఖీభవ’ ద్వారా ప్రతీ రైతుకు ఏటా రూ. 20,000 అందించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.’స్త్రీశక్తి’ ద్వారా మహిళలు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.అర్హులైన ప్రతీ ఒక్కరికీ నూతన పెన్షన్లు, సదరమ్ సర్టిఫికేట్లు మరియు గృహనిర్మాణ మంజూరు సత్వరమే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కేబినెట్ సమావేశంలో స్థానిక సమస్యలను చర్చించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తామని అన్నారు. ఐదేళ్ల గత ప్రభుత్వ పాలనలో కనీసం ప్రధాన రోడ్లను కూడా పట్టించుకోలేదని, పనుల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రధాన రోడ్లతో పాటు పుంత రోడ్లను కూడా అభివృద్ధి చేస్తోందని ఈ నేపథ్యంలో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు.ఊరి బాగు కోసం ప్రజలు పనులను డిమాండ్ చేసి అడగాలని, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆశీర్వదించాలని కోరారు.

Scroll to Top
Share via
Copy link