డీఎస్సీపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు

16 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూటమిదే

కోర్టు సైతం వైసీపీ నేతలకు మొట్టికాయలు వేసింది

తణుకులో కూటమి నాయకులు ధ్వజం

డీఎస్సీ నిర్వహణపై విమర్శలు చేసే నైతిక అర్హత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు లేదని తణుకు కూటమి నాయకులు విమర్శించారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తణుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్‌ కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పితాని మోహన్‌రావు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగ యువతను, ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని తెలిపారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణను కూడా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించిన వైసీపీ నాయకులకు కూడా న్యాయస్థానం గట్టి వ్యాఖ్యలు చేసిందని అన్నారు. నష్టపోయిన అభ్యర్థుల తరఫున కాకుండా రాజకీయ పార్టీ తరఫున ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడం సమంజసం కాదని కోర్టు పేర్కొనడం వైసీపీ నాయకులకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించడం మానుకుని, వారి భవిష్యత్తు కోసం నిర్మాణాత్మక సూచనలు చేయాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని బలోపేతం చేయడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link