విపక్షానికి రాజకీయాలు ముఖ్యం, కూటమి ప్రభుత్వానికి రైతన్న సంక్షేమమే ముఖ్యం: మంత్రి కందుల దుర్గేష్

రైతు బజార్లలో ప్రత్యేక అవుట్‌లెట్లు….నిడదవోలులో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో రూ.52కే సోనామసూరి బియ్యం పంపిణీ ..ధనిక-పేద తేడా లేకుండా…. అందరి ఇంట్లోనూ ఒకే నాణ్యమైన బియ్యం!

పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా… ప్రైస్ డిఫరెన్స్ కాంపన్సేషన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి

పని మేము చేస్తే… ఉచిత క్రెడిట్ మీదా? విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పర్యటనలపై మంత్రి దుర్గేష్ సెటైర్లు

ఆయన పర్యటనలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే..పని పూర్తయ్యాక క్రెడిట్ డ్రామాలా?

*”అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం… ఓడిపోయాక ఉద్యమాలా? ఇదెక్కడి న్యాయం?..”విపక్షానికి రాజకీయాలు ముఖ్యం… మాకు రైతన్న సంక్షేమమే ముఖ్యం!”: మంత్రి కందుల దుర్గేష్”

నిడదవోలు: రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు ఏర్పాటు చేసిన రైతుబజార్లు, రైస్ మిల్లుల అవుట్‌లెట్ స్టోర్లను మరియు తక్కువ ధరలకే సన్నబియ్యం విక్రయించే ప్రత్యేక కార్యక్రమాన్ని మంత్రి రిబ్బన్ కట్ చేసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పేద లబ్ధిదారులకు తన చేతుల మీదుగా మంత్రి దుర్గేష్ సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… బహిరంగ మార్కెట్‌లో రూ. 60 నుండి రూ. 65 వరకు పలుకుతున్న సోనామసూరి బియ్యాన్ని పేదలకు ఊరట కలిగిస్తూ కేవలం రూ. 52 లకే ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. లబ్ధిదారులకు నెలకు 10 కేజీల చొప్పున ఈ ధరకే అందజేస్తామన్నారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాల్లో బియ్యం సప్లై జరుగుతోందని, ప్రజల సౌకర్యార్థం నిడదవోలు నియోజకవర్గంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో కొత్త అవుట్‌లెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే (కొన్నిసార్లు 6 గంటల్లోనే) నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న రూ. 1,600 కోట్లకు పైగా బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు.”ధనిక, పేద తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ నాణ్యమైన సన్నబియ్యం తినాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ల సమన్వయంతో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం.” అని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి మంత్రి కందుల దుర్గేష్ వివరిస్తూ.. ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ల పెంపుతో వృద్ధులకు,దివ్యాంగులకు, మంచానపడ్డ వ్యాధిగ్రస్తులకు చేయూతనందిస్తున్నామన్నారు. ‘స్త్రీశక్తి’ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ‘దీపం 2’ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు.
‘తల్లికి వందనం’ ద్వారా కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంతమంది పిల్లలకు ఏటా రూ. 15,000, ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ ద్వారా రైతన్నలకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

పొగాకు రైతుల సంక్షేమం & విపక్షాల వైఖరిపై స్పందన:

గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వల్ల పొగాకు రైతులకు జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ, ధరల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రైతులను విస్మరించిన విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లా పర్యటనలు చేస్తూ నాటకాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి పొగాకు రైతులకు మద్దతు ధరతో పాటు ప్రైస్ డిఫరెన్స్ కాంపన్సేషన్ ఇస్తుంటే సమస్య ముగిసే సమయంలో జగన్ మోహన్ రెడ్డి డ్రామాలతో క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ సందర్భంగా మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెతను ఉదహరించారు.ఐదేళ్ల గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసి 6 నెలల నుండి ఏడాదైనా పైసలు ఇవ్వకుండా రైతులను ఏడిపించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పెట్టిన రూ. 1,600 కోట్ల ధాన్యం బకాయిలను చెల్లించి, ఇప్పుడు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు వేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.ఐదేళ్ల పాలనలో పొగాకు, కౌలు రైతులను పూర్తిగా విస్మరించిన జగన్ మోహన్ రెడ్డి అధికార కోల్పోయాక రాజకీయం చేయడానికి, శవ రాజకీయాలు చేయడానికి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారని గట్టిగా తిప్పికొట్టారు. పని మేము చేస్తే… ఉచిత క్రెడిట్ మీదా? అంటూ విపక్షాన్ని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలను అన్యాయం చేసి.. ఓడిపోయాక ఉద్యమాలా? ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నించారు. విపక్షానికి రాజకీయాలు ముఖ్యం… కూటమి ప్రభుత్వానికి రైతన్న సంక్షేమమే ముఖ్యం అన్నారు.

కేవలం పొగాకు, ధాన్యమే కాకుండా కోకో మరియు ఇతర పంటల రైతులకు కూడా వడ్డీ లేని రుణాలు, స్వల్పకాలిక-దీర్ఘకాలిక వ్యవసాయ ప్రణాళికలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.గత వైకాపా ప్రభుత్వంలో ‘రైతు భరోసా’ లబ్ధిదారుల ఎంపికలో కుల, రాజకీయ పక్షపాతం చూపారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ను కులాలకు అతీతంగా అర్హులైన ప్రతీ రైతుకు అందిస్తోందని స్పష్టం చేశారు.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు 100% లబ్ధిదారులకు అందాలంటే అధికారులు ప్రో-యాక్టివ్‌గా (ముందుచూపుతో) పనిచేసి సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link