(రాజమహేంద్రవరం – అక్షర భూమి): ఏ తల్లీ ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అధునాతన “తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.. శనివారం రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆస్పత్రి ప్రాంగణంలో తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను కొబ్బరికాయ కొట్టి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడం మరియు మాతా, శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించడమే ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ సాధనలో ప్రభుత్వ మూల ఉద్దేశమని అన్నారు. ప్రసవానంతరం బాలింతలను సురక్షితంగా ఇంటికి చేర్చడంతో పాటు, ప్రసవానికి ముందు చెకప్‌లు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, మరియు తీవ్ర రక్తహీనతతో ఐరన్/సుక్రోజ్ ఇంజెక్షన్లు అవసరమైన గర్భిణులను ఆస్పత్రికి తీసుకురావడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయని వివరించారు. ఇవి పూర్తిగా బ్రాండ్ న్యూ ఏసీ వాహనాలని, ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగ్‌లు, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర సమయాల్లో సహాయం కోసం SOS బటన్, 102 కాల్ సెంటర్ సదుపాయాలతో రూపొందించబడ్డాయని తెలిపారు. గర్భిణులు, బాలింతలు 102 సంఖ్యకు కాల్ చేసి ఉచితంగా ఈ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. ఏఎన్ఎం లు, పిహెచ్ఎసి సిబ్బంది సమన్వయంతో గర్భిణులను ఆసుపత్రికి తీసుకువచ్చి, క్షేమంగా తిరిగి ఇంటికి చేరుస్తారని వెల్లడించారు. ఈ వాహనాలను ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించుకున్నామని, సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకొని సరైన చికిత్సలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అటు అధికారులు, రాజకీయ నాయకులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వాహనాలనే ఎప్పటికప్పుడు వాహనాల నిర్వహణ సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.




