(ఇరగవరం – అక్షరభూమి) తణుకు నియోజకవర్గం అయితంపూడి గ్రామ మాజీ సర్పంచ్ లావణ్య ఇంటి కూల్చివేత ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్సీల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం లావణ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీల బృందం, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. అర్ధరాత్రి సమయంలో అధికారులను వెంటబెట్టుకుని వచ్చి మహిళా మాజీ సర్పంచ్ ఇంటిని కూల్చివేయడం దారుణమని పేర్కొన్నారు. కూటమి నేతలు చెప్పుకునే “డబుల్ ఇంజన్ ప్రభుత్వం” ప్రస్తుతం “బుల్డోజర్ ప్రభుత్వం”గా మారిందని విమర్శించారు. లావణ్య కుటుంబం ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామంలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది మాజీ సర్పంచ్ లావణ్య అని గుర్తుచేశారు. రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన వ్యక్తి అదే రోడ్డు కోసం ఆక్రమణకు పాల్పడతారని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కాలం మారుతుంది, అధికారం కూడా మారుతుంది, మా టైం కూడా మాకు వస్తుంది. ఇలాంటి కక్షపూరిత ధోరణితో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న అందరికీ బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధముగా ఉన్నారు. ఎమ్మెల్యే గారూ.. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఆంధ్రలో కాదు, అమెరికాలో ఉన్నా కూడా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న కొందరు అధికారులు ఎక్కడ దాక్కున్నా కూడా చట్టానికి అప్పగించి తీరుతాం” అని ఆమె హెచ్చరించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆయన కుమారుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో నాగేశ్వరరావు కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని, ప్రస్తుతం జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు రాజకీయంగా సమాధానం చెబుతామని అన్నారు.
రానున్న రోజుల్లో కారుమూరి నాగేశ్వరరావు అధికారంలోకి వచ్చాక సినిమా చూస్తారు: ఎమ్మెల్సీ కల్పలత
ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ అయితంపూడి మాజీ మహిళా సర్పంచ్ లావణ్య గారి ఇంటి కూల్చివేతను దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఒక రకమైన నిబంధనలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా ఉంటే మరో రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులుగా ఉన్నందుకే లావణ్య కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. రానున్న రోజుల్లో కారుమూరి నాగేశ్వరరావు తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రస్తుత పాలకులు “సినిమా చూస్తారని” ఆమె హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కనుమూరి విజయ దుర్గ, భీమవరం టౌన్ ప్రెసిడెంట్ చె. కృపామణి, భీమవరం 25వ వార్డు సెక్రటరీ పట్టెం శశితల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి మొగ్గ మంగ, ఎస్. ఎలిజిబెత్ రాణి, ఎస్. ఆశాజ్యోతి, బుద్ధరాజు సత్యాదేవి, తణుకు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, అత్తిలి మండల మహిళా అధ్యక్షురాలు కాకర్ల విశాలక్ష్మి, ఇరగవరం మండల మహిళా అధ్యక్షురాలు మెట్ల కిరణ్మయి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, షైక్ పాహిమా, టౌన్ మహిళా ప్రెసిడెంట్ నూకల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు


