రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ‘మైత్రేయ బుద్ధ విహార్’ ప్రారంభోత్సవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి, ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం లో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ‘మైత్రేయ బుద్ధ విహార్’ ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌతమ బుద్ధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ దమ్మ పీఠాధిపతి బంతె అనాలయో, శ్రీలంక నుంచి విచ్చేసిన డాక్టర్ బోధగామ చండిమా నాయకే థీరోల ఆశీస్సులు స్వీకరించిన మంత్రి దుర్గేష్ పలు దేశాల నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధులతో మాట్లాడారు. గ్రామ మాజీ సర్పంచ్, టిడిపి నాయకుడు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవంలో తొలుత మైత్రేయ బుద్ధ విహార ఆవరణలో బౌద్ధ బిక్షువులతో కలిసి పతాక ఆవిష్కరణ గావించిన మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సుమారు 2500 సంవత్సారాల క్రితం నుండి బుద్ధుని పవిత్ర బోధనలు ప్రేమ, సహనం, కరుణ మానవాళి పాటిస్తుందని, ద్వేషాన్ని ప్రేంతో మాత్రమే తగ్గించగలమని గౌతమ బుద్ధుడు ఆచరించి సమాజంలో ఆయన సందేశాలు ప్రతీ ఒక్కరూ పాటించాలని అన్నారు. అదేవిదంగా బుద్ధుడు సంచరించిన పవిత్ర ప్రాంతంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరానికి గుర్తింపు ఉందన్నారు. యువత మరియు విద్యార్థుల్లో ఆధ్యాత్మిక, నైతిక విలువలను పెంపొందించేలా ఈ విహార్ తోడ్పడాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.మైత్రేయ బుద్ధ విహార్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా, విశ్వవ్యాప్తం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తర భారతదేశం తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలోని తొట్లకొండ, బావికొండ, ఆదుర్రు, ఉండ్రాజవరం, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాంతి, సహనం, అహింస అనేది ఏ కాలానికైనా ఆచరణీయమైనవని, ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలమన్న బుద్ధుని సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వంటి ఎందరో మహానీయులు కూడా ఈ మార్గాన్ని అనుసరించారని గుర్తుచేశారు. ఆగస్టు 1వ తేదీ భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని పర్యటన ఉండటంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాలేకపోయారని స్పష్టం చేశారు. మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకులు పూజ్య బంతేజి అనాలియో మాట్లాడుతూ పరిపూర్ణమైన శాంతి, ఆనందాన్ని సాధించడానికి బుద్ధ భగవానులవారు వివిధ ధ్యానయోగ ఆధ్యాత్మిక ప్రక్రియలతో కూడిన తత్వజ్ణాన్ని మానవాళికి అందించారు. వాటన్నింటిని ఒకచోట చేర్చి అందరికీ అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో బుద్ధగయ మహాపుణ్యక్షేత్రంలో వెలసిన బౌద్ధారామం మాదిరి బౌద్ధారామం ఉండ్రాజవరం గ్రామంలో నిర్మించామని మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకులు పూజ్య బంతేజి అనాలియో అన్నారు. ఈ మైత్రేయ బుద్ధ విహార నిర్మాణంలో ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం అందించిన సహకారం మరువలేనిదని, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు ఎంతో సహకరించారని, ఈ నిర్మాణంలో ఇరువురు తనకు రెండుకళ్ళ వంటివారని అన్నారు. ఇక్కడ ఆలయ నిర్మాణం విరమించుకున్న దశలో బూరుగుపల్లి కళారావు వెన్నంటే ఉండి అన్నీ తానై విహార నిర్మాణంలో పాల్గొన్నారని అదేవిదంగా ఎందరో ఈ మైత్రేయ బుద్ధ విహార నిర్మాణానికి విరాళాలు వస్తు, ధన, శ్రమ రూపంలో సహకరించారని అన్నారు. సభాధ్యక్షులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మైత్రేయ బుద్ధ విహార ఆలయాన్ని ఉండ్రాజవరంలో నిర్మించడం తమకు గర్వకారణమని, ఈ మైత్రేయ బుద్ధ విహార అభివృద్దికి నాయకులు, పరిసర గ్రామ ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పర్యాటక శాఖా మంత్రి దుర్గేష్ విహార అభివృద్దికి పర్యాటక శాఖ నుండి సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి బౌద్ధ బిక్షువులు, ఉపాసకులు, మాజీ డీజీపీ అంజిరెడ్డి, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, జిల్లా బిజెపి నాయకులు అక్కిన గోపాలకృష్ణ, మండల టిడిపి అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, తాడిపర్రు గ్రామ మాజీ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు, పాలంగి సొసైటీ చైర్మన్ కాకర్ల నాని, మండల బిజెపి అధ్యక్షుడు కొప్పిశెట్టి సత్యనారాయణ, కె.సావరం మాజీ సర్పంచ్ నార్ని రామకృష్ణ, వివిధ రాష్ట్రాలనుండి బుద్దిస్ట్, ఉపాసకులు పాల్గొనగా పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి బుద్ధ భగవానుని దర్శించుకుని , భారీగా నిర్వహించిన అన్నసమారాధన లో పాల్గొన్నారు. వందలాదిగా వాలంటీర్లు సేవలు అందించారు.

Scroll to Top
Share via
Copy link