స్థానికుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి.. యుద్ధప్రతిపాదికన చర్యలకు ఆదేశం
ప్రజారోగ్యానికి, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ
నిడదవోలు: నిడదవోలు పట్టణ సమీపంలోని తిమ్మరాజుపాలెం, ప్రసిద్ధ శ్రీ కోట సత్తెమ్మ ఆలయ పరిసరాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తక్షణమే స్పందించారు. డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న దట్టమైన పొగ వల్ల స్థానిక ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, రహదారిపై పొగ అలుముకోవడం వల్ల వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే మంత్రి, దుర్గేష్ ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్య తీవ్రతను గమనించిన మంత్రి కందుల దుర్గేష్.. నిడదవోలు మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. వేసవి తీవ్రత, అధిక ఉష్ణోగ్రతల (హీట్ వేవ్స్) కారణంగా డంపింగ్ యార్డ్‌లోని వ్యర్థాలలో అంతర్గతంగా మంటలు రేగి, పొగ వ్యాపిస్తోందని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పొగను పూర్తిగా అదుపు చేయడానికి నిరంతరం నీటిని చల్లుతూ (తడుపుతూ) ఉండాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు, స్థానిక ప్రజలకు మరియు వాహనదారులకు ఎటువంటి ఆరోగ్య, భద్రతా సమస్యలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు..
మున్సిపల్ కమిషనర్ మంత్రి ఆదేశాలపై స్పందిస్తూ.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించామని, వ్యర్థాలు వేడెక్కకుండా క్రమం తప్పకుండా నీరు చల్లేలా సిబ్బందిని పురమాయించామని వెల్లడించారు. ఇకపై ఇక్కడ పొగ సమస్య తలెత్తకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రికి హామీ ఇచ్చారు. సమస్యను తమ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించి, అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి కందుల దుర్గేష్ చొరవ పట్ల నిడదవోలు పట్టణ ప్రజలు, శ్రీ కోట సత్తెమ్మ ఆలయ భక్తులు సంపూర్ణ హర్షాన్ని వ్యక్తం చేశారు



