నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఆలయాల అభివృద్ధికి నూతనంగా ఏర్పాటైన ట్రస్ట్ బోర్డు సభ్యులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం తణుకు పట్టణంలో వేంచేసిన కేశవస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం, శ్రీనటరాజ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ట్రస్ట్ బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ దేవాలయాల విశిష్టతను కాపాడే విధంగా ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా భక్తులకు సేవలు అందించేందుకు ట్రస్ట్ బోర్డు సభ్యులు కృషి చేయాలని కోరారు. రెండేళ్ల పదవి కాలంలో పాలకవర్గం ఆలయాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయాల అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో నూతన పాలకవర్గం సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


