నిడదవోలులో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మహిళల చెస్ పోటీలు

 ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీ కందుల దుర్గేష్.. స్వయంగా చిన్నారులతో చెస్ ఆడిన మంత్రి దుర్గేష్

స్థానిక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిడదవోలులో రాష్ట్ర స్థాయి మహిళల చదరంగం పోటీలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పచ్చిపులుసు వీర్రాజు, కావమ్మ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఈనెల 11, 12 తేదీల్లో (రెండు రోజుల పాటు) నిర్వహించనున్న ఈ క్రీడా సంబరానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్వయంగా చెస్ బోర్డు ముందుకు చేరి, పోటీల్లో పాల్గొంటున్న చిన్నారులతో చదరంగం ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్  తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో క్రీడాకారిణులను, ఆహూతులను విశేషంగా అలరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్  మాట్లాడుతూ.. చెస్ ఆడటం అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదని, అది మెదడుకు పదును పెట్టే అద్భుతమైన సాధనమని కొనియాడారు. చదరంగం వల్ల ఆలోచనా శక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయని, జ్ఞాపకశక్తి మెరుగవుతుందని తెలిపారు. నిరంతరం చెస్ సాధన చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ఓర్పు, క్రమశిక్షణ అలవడతాయని, మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని మంత్రి  పేర్కొన్నారు. నేటి ఆధునిక దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు వినోదాన్ని, ఉల్లాసాన్ని అందించడంలో చదరంగం ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.

రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొంటున్న మహిళా, బాలికా క్రీడాకారిణులందరికీ ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, “ఆల్ ది బెస్ట్” చెప్పారు. మహిళల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్న వాసవి క్లబ్ ప్రతినిధులను, నిర్వాహకులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు బచ్చు వీవీకే సుమన్ కుమార్, ప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link