తదేకం ఫౌండేషన్ సహకారంతో తీపర్రులో ‘మా గోదావరి సంకల్ప్’ 

 ప్రతిపాదనలు..సంక్రాంతి నాటికి తీపర్రు మోడల్ విలేజ్ పనులు పూర్తి చేస్తాం: మంత్రి దుర్గేష్
2027 గోదావరి పుష్కరాల నాటికి నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ‘తీపర్రు’ గ్రామాన్ని ఆదర్శ పుష్కర గ్రామంగా, స్థానిక ఘాట్‌ను మోడల్ ఘాట్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం తీపర్రులో తదేకం ఫౌండేషన్ సహకారంతో తలపెట్టిన ‘మా గోదావరి సంకల్ప్’ కార్యక్రమాన్ని మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మెరుగైన రవాణా సౌకర్యాలు, అందమైన నదీతీరం ఉండటం వల్ల గ్రామస్థుల సహకారంతో తీపర్రును మోడల్ విలేజ్‌గా ఎంపిక చేసినట్లు తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందని పేర్కొన్నారు. తీపర్రు మోడల్ విలేజ్ పనులను రాబోయే సంక్రాంతి నాటికి పూర్తి చేసే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ, నైతిక విలువల పెంపొందించడం కోసం నిరంతరం తపించే ‘తదేకం ఫౌండేషన్’ ఈ ఘాట్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ఘాట్ సుందరీకరణ ద్వారా మరిన్ని ప్రాంతాల్లో ఘాట్ల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని, భక్తులకు వసతులు కల్పించేందుకు ఇక్కడ ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి పుష్కరాల నాటికి విజ్జేశ్వరం నుండి సిద్ధాంతం వరకు ఉన్న 36 కిలోమీటర్ల పొడవైన ఏటిగట్టును పటిష్టపరిచి, రవాణాకు అనుకూలంగా మంచి రహదారిని ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి దుర్గేష్ చెప్పారు. శనివారం రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో కూడా దీనిపై చర్చించి రూ. 96 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. ఈ పరిధిలోని 29 ఘాట్లను బాగు చేయడం ద్వారా పుష్కరాల సమయంలో వచ్చే 10 నుండి 15 లక్షల మంది భక్తుల తాకిడిని తట్టుకోవచ్చని వెల్లడించారు.
తీపర్రు గ్రామానికి వెళ్ళడానికి, రావడానికి ప్రస్తుతం ఒకే మార్గం ఉన్నందున, రూ. 1.80 కోట్లతో మరో ప్రత్యామ్నాయ రహదారికి ప్రతిపాదనలు పంపామని, దీనికి సంబంధించిన సర్వే కూడా పూర్తయిందని, పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.పుష్కరాల నాటికి తీపర్రు ఘాట్ వద్ద నిలువెత్తు గోదావరి తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గతంలో మూసేసిన స్థానిక చింతాలమ్మ చెరువును పునరుద్ధరించి, పుష్కరాల నాటికి సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
గతంలో గోదావరి పుష్కరాలు అంటే కేవలం రాజమహేంద్రవరానికే పరిమితం అయ్యేవని, కానీ కొవ్వూరు గోష్పాద ఘాట్, ముక్కామల, తీపర్రు, పెండ్యాల తదితర ప్రాంతాల్లో కూడా గొప్ప ఘాట్లు ఉన్నాయన్నారు. ఏ ఘాట్‌లో స్నానం చేసినా ఒకే పుణ్యఫలం లభిస్తుందనే విషయాన్ని ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ద్వారా ఆరు జిల్లాల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయిస్తామన్నారు.భక్తులు కేవలం పుణ్యస్నానాలకే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉన్న ద్వారకా తిరుమల, వాడపల్లి, కోటసత్తెమ్మ తల్లి, గోలింగేశ్వరస్వామి తదితర ఆలయాలను దర్శించుకునేలా దేవాదాయ శాఖతో కలిసి పర్యాటక శాఖ ప్రత్యేక ‘టూరిస్ట్ సర్క్యూట్’లను సిద్ధం చేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. సీఎం నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చించి భక్తుల భద్రతకు, సౌకర్యాలకు దిశానిర్దేశం చేసిందన్నారు.
పుష్కర ఘాట్లను ప్లాస్టిక్ రహితంగా, కాలుష్య రహితంగా ఉంచేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నీటికి, మత్స్యకారులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేస్తూ.. మత్స్యకారుల జీవన విధానం దెబ్బతినకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, వేట నిషేధ సమయంలో వారికి ఇప్పటికే రూ. 20,000 ఆర్థిక సాయం అందించామని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు.తీపర్రు ఘాట్ అభివృద్ధి చేసుకొని “భక్తిని, ముక్తిని, పుణ్యాన్ని పొందుతాం” అనే నినాదంతో అందరూ ముందుకు సాగాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link