ప్రభుత్వం నుంచి రూ. 16 కోట్లు నిధులు మంజూరు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి వార్డుల వారీగా మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి శనివారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఇటీవల తణుకు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రూ. 16 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 50 కోట్లు నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇప్పటికే రూ. 16 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ పరిధిలోని వార్డుల వారీగా చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పలు వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలు ఫిర్యాదులు అందుతున్నాయని ఈ పరిస్థితుల్లో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వివిధ కార్పొరేషన్ల ద్వారా రెండేళ్ల కాలంలో రూ. 178 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. రోడ్లు నిర్మాణానికి సంబంధించి 13.5 కిలోమీటర్లకు గాను 94 పనులకు రూ. 16 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి 93 పనుల్లో 21.42 కిలోమీటర్లు మేర నిర్మాణానికి రూ. 11 కోట్లు చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరాకు సంబంధించి 74 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మాణానికి రూ.120 కోట్లు నిధులు అమృత్ పథకంలో మంజూరు అయినట్లు చెప్పారు. నూరు శాతం ఇంటింటికి గోదావరి జలాలను కుళాయి ద్వారా తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4.77 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. 21 పార్కులు అభివృద్ధి చేయడానికి రూ. 7 కోట్లు మంజూరు చేసామని తెలిపారు. త్వరలో తణుకులో దాదాపు అన్ని పార్కులను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తణుకులోని ఎన్టీఆర్ పార్కును రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద 412 పనులకు సంబంధించి రూ.178 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణంలోని వార్డు ఇన్ ఛార్జీలు, తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



