భారతరత్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ 123వ జయంతి

రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఈ రోజు మనం స్మరించుకుంటున్న మహానుభావుడు, భారతరత్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక శాశ్వత స్ఫూర్తి. ఆయన జీవితం ప్రజాస్వామ్య పరిరక్షణకు, సామాజిక న్యాయ స్థాపనకు, దేశనిర్మాణానికి అంకితమైన ఒక నిరంతర యాత్ర అని తెలిపారు.

జయప్రకాశ్ నారాయణ స్వాతంత్ర్య సమర యోధుడిగా, సర్వోదయ ఉద్యమం ద్వారా సమాజంలోని ప్రతి వర్గాన్ని ఐక్యపరచి, సేవ, సహకారం, సత్యం అనే విలువలతో కూడిన జీవన విధానాన్ని నిర్మించారు.
సర్వోదయ ఉద్యమం ఆయనకు కేవలం రాజకీయ లక్ష్యం కాదు అది ప్రజలలో నైతికత, సామాజిక సమానత్వం, స్వచ్ఛతను నింపే ఒక ఉద్యమం అని తెలిపారు.

ఆయన ప్రారంభించిన “సంపూర్ణ క్రాంతి ఉద్యమం” భారత రాజకీయ చరిత్రలో ప్రజల్లో రాజకీయ చైతన్యం రగిలించిన మహత్తర ఘట్టమని పేర్కొన్నారు.

ఆయన నాయకత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు దారి చూపిందని, ఆయన పుట్టినరోజును ప్రభుత్వం “ప్రజాస్వామ్య పరిరక్షణ” దినంగా ప్రకటించడం గర్వకారణమని మంత్రి అభిప్రాయపడ్డారు.

జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితోనే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన “ధన ధాన్య కృషి యోజన పథకం” రైతు సంక్షేమానికి, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పంటల ఉత్పాదకత మరియు రుణ పరిమితి తక్కువగా ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేయబడ్డాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు ఎంపిక అయినాయి అని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు మార్కెట్ కమిటీలు ఈ పథకం గురించి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాయని,
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఉత్పాదకతను పెంచుకోవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ రోజు ఆయన 123వ జయంతి సందర్భంగా, మనమందరం ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకువచ్చి,
ప్రజాస్వామ్య పరిరక్షణకు, రైతు సంక్షేమానికి, దేశ స్వావలంబనకు కృషి చేద్దాం. అదే నిజమైన జయప్రకాశ్ నారాయణ కి అర్పించే శ్రేష్ఠ నివాళి అవుతుంది అని మంత్రి గారు పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link