ప్రభుత్వాసుపత్రిలో నెఫ్రాలజీ విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
వివినికిడి సమస్య కోసం బెరా అత్యాధునిక పరికరం ప్రారంభించిన ఎమ్మెల్యే
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక యాపిల్ ఆసుపత్రి సహకారంతో మూత్రపిండాల సమస్యకు సంబంధించి వైద్యులను కన్సల్టెంట్ గా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ మేరకు శనివారం ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ప్రతి శనివారం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ కిడ్నీ సమస్యలకు సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా వారికి కావలసిన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా యాపిల్ ఆసుపత్రి యాజమాన్యానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చెవిటి పరీక్షలు చేయడానికి అత్యాధునికమైన బెరా మిషనరీ రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సదరం ద్వారా వెనుకటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి పరీక్షలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. సుమారు రూ. 20 లక్షల వ్యయంతో ఈ పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు యాపిల్ ఆసుపత్రి యాజమాన్యం, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


