తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
66 మందికి రూ.35.91 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత…
కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తణుకు నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు రూ. 35.91 లక్షల విలువైన చెక్కులను బుధవారం బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబునాయుడు ఆరోగ్యం, వైద్యానికి పెద్ద పీట వేస్తూ వైద్యం అందడం లేదని ఎవరు నిరాశ చెందకుండా ఉండేలా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని దీంతోపాటు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం అండగా ఉండే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ. 4.50 కోట్లు మేర సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


