తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హామీ
దువ్వ–ముద్దాపురం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
తణుకు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని కోరారు. తణుకు మండలం దువ్వ నుంచి ముద్దాపురం గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. రూ.1.50 కోట్లుతో మొదటి విడత ముద్దాపురం వరకు, రెండో విడతలో రూ.5 కోట్లుతో సీసీ రోడ్డు నిర్మాణంతోపాటు కోనాల వరకు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అటు అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. తణుకు నియోజకవర్గంలో ముద్దాపురం, కోనాల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుక ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ధాన్యం కొనుగోలులో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కట్టుబడి ఉందన్నారు. యూరియా కొరత లేకుండా కేంద్రంతో సంప్రదించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


