తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకులో డాక్టర్ ముళ్లపూడి వర్థంతి కార్యక్రమం
అనేక పరిశ్రమలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆంధ్రా బిర్లాగా కీర్తి శేషులు డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ ప్రపంచ పటంలో తణుకు ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకువచ్చారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ వర్థంతి కార్యక్రమాన్ని బుధవారం తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా ముళ్లపూడి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. పారిశ్రామిక, సేవా, విద్యా, వైద్య రంగాలతోపాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. పారిశ్రామికంగా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పిన ఆయన తణుకు ప్రాంతం అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని కొనియాడారు. సేవా కార్యక్రమాల ద్వారా అనేక విద్యాసంస్థలను నెలకొల్పి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. తణుకు పట్టణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


