రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలవారీగా విద్యార్థులకు మెనూ
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఇకపై మధ్యాహ్నం భోజన పథకంలో సన్న బియ్యం అందించి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన మెనూ ద్వారా పిల్లలకు పౌష్టిక ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రాంతాలవారీగా ఆహారపు అలవాట్లను ఆధారంగా చేసుకుని ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించారు. పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు అందించడంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించడానికి ప్రత్యేకమైన ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేసిందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


