రాబోయే రోజుల్లో ఇంటింటికీ తాగునీరు లక్ష్యం
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
రూ. 3.50 కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం
గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురయ్యిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి మండలాల పరిధిలో రూ. 3.50 కోట్లు వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు నిర్లక్ష్యం చేయడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణంతోపాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్లు నిర్మాణంతోపాటు ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. జలజీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు, దాతలు సహకరించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


