రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు అయింది. బుధవారం ఉదయం శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ-9 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. తన ఇంటి నిర్మాణం ద్వారా రాజధాని అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులోభాగంగా ఇటీవల అమరావతిలో ఐదు ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అలాగే అదే సమయంలో ఆమె తన గాజులను దానంగా అందజేశారని రైతులు వివరించారు. ఆ కుటుంబానికి తమ గ్రామం ఎంత ఇచ్చినా తక్కువేనని.. ఉడతా భక్తి కింద ఆ దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామని వారు పేర్కొన్నారు. 2500 గజాల్లో రాజధాని ఇంటి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టనున్న సంగతి తెలిసిందే. కార్యాలయం, నివాసంలోపాటు కారు పార్కింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.


