జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల నమోదు.. తాడిపర్రు వేదికగా మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన!
నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామం నేడు సరికొత్త ఆప్యాయతలకు వేదికైంది. తెల్లవారుజామునే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గ్రామంలో పర్యటించి, ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. కేవలం అధికారిగా కాకుండా, ఒక ఇంట్లోని పెద్దకొడుకులా ప్రతి గడపకూ వెళ్లిన మంత్రి.. అవ్వాతాతలను, దివ్యాంగులను గుండెలకు హత్తుకున్నారు. పెన్షన్ డబ్బులను చేతిలో పెడుతూ.. “అవ్వా! ప్రతి నెలా పెన్షన్ సకాలంలో అందుతుందా? ఈ డబ్బులు నీకు దేనికి ఉపయోగపడుతున్నాయి?” అంటూ ఆప్యాయంగా ఆరా తీశారు. మంత్రి దుర్గేష్ పలకరింపునకు వృద్ధులు, మహిళలు మురిసిపోతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పర్యటనలో మంత్రి దుర్గేష్ స్వయంగా బట్టలు ఇస్త్రీ చేసి, శ్రమజీవుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. అనంతరం స్థానిక రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అబద్ధాల అడ్డుగోడలు బద్దలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఈ పెన్షన్ల పంపిణీనే నిదర్శనమన్నారు. “గతంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వస్తే పెన్షన్లు రావని, ఆఫీసుల చుట్టూ తిరగాలంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే.. ప్రతినెలా ఒకటో తేదీనే తెల్లవారుజామున ప్రతి గడపకూ పెన్షన్ అందిస్తున్నాం. ఒకవేళ సెలవు రోజైతే, అంతకంటే ఒకరోజు ముందు అందించి సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాం.” అన్నారు.
“గత ప్రభుత్వం పెన్షన్ రూ.1,000 పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే.. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను ఏకంగా రూ.4,000కు పెంచి పేదల గుండెల్లో నిలిచింది. అలాగే దివ్యాంగులకు రూ.6,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15,000 అందిస్తూ అండగా నిలబడ్డాం.” అన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన – త్వరితగతిన పూర్తికి ఆదేశాలు*
తాడిపర్రు గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి దుర్గేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ, గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో తాడిపర్రు సొసైటీ చైర్మన్ దుర్గాబాలకృష్ణ, పాలంగి సొసైటీ చైర్మన్ కాకర్ల నరసన్న (నాని), టిడిపి నాయకులు పెండ్యాల గోవిందు, వాకలపూడి సత్యనారాయణ, జనసేన నాయకులు నిమ్మల సాంబశివరావు, కాకర్ల కరుణాకర్, జిల్లా బిజేపి నాయకులు అక్కిన గోపాలకృష్ణ, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



