దళిత క్రైస్తవులంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
తణుకులో దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన సభ విజయవంతం
దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల సాధనకోసం, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన కోసం జరిపే ఉద్యమాలకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని తణుకు దళిత క్రైస్తవ ఐక్యవేదిక పిలుపునిచ్చింది.
ఈ మేరకు ఆదివారం సాయంత్రం తణుకు స్థానిక శ్రీ భాగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కళ్యాణ మండపంలో దళిత క్రైస్తవ రాజ్యాంగబద్ధ హక్కుల సాధన సభ పేరిట నిర్వహించిన సభలో భవిష్యత్తు కార్య చరణ ప్రకటించారు.
దళిత క్రైస్తవ ఐక్యవేదిక కన్వీనర్ కోనాల భీమారావు
ఆధ్వర్యంలో కో- కన్వీనర్ లాజర్ అబ్బదాసరి అధ్యక్షతన ఈ సభను నిర్వహించారు. ఈ సభకు తణుకు పరిసర ప్రాంతాల దళిత క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. తొలుత ఈ సభలో జాతీయ దళిత ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడుతారని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన హాజరు కాలేదు.
ఈ సందర్భంగా దళిత క్రైస్తవ ఐక్యవేదిక కన్వీనర్ కోనాల భీమారావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు దళితులకు వర్తింపచేయాలని, వివక్షపూరిత 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మూడవ పేరాను తొలగించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
కో కన్వీనర్ లాజర్ అబ్బదాసరి మాట్లాడుతూ సుమారు మూడు దశాబ్దాలు తర్వాత మాల మాదిగలు ఓకే వేదికపై ఐకమత్యంతో దళిత క్రైస్తవ హక్కుల కోసం సభ నిర్వహించుకోవడం ముదావహం అన్నారు. దీర్ఘకాలిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జూన్ 10వ తేదీ కమిటీకి సమర్పించే నివేదిక విషయంలో తాత్సారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు లీగల్ కమిటీ సభ్యులు ప్రముఖ న్యాయవాది జంగా సుందర్ కుమార్, విన్నప సుధాకర్, పెరికే ప్రసాద్, బీఎస్పీ మధు, న్యాయవాది బింకం రవి కుమార్, పాస్టర్ పి.ఆశిష్ విక్టర్, దాసి మత్తయ్య రాజు, రాజ్ రిత్విక్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. తణుకు ఏరియా అన్ని సంఘ కాపరులు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



