రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

ఘనస్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ అధికారిక పర్యటన నిమిత్తం రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్ షెల్టన్ వద్ద రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రేపు (సోమవారం) రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా, పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న వివిధ పనులను ఉప ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. అదేవిధంగా పుష్కరాల ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపై వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. గోదావరి నది పవిత్రతను కాపాడుతూ, కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారని అన్నారు. నగర పరిధిలో చేపట్టాల్సిన పలు ఇతర అభివృద్ధి పనుల్లో కూడా ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. రాజమండ్రి ప్రాధాన్యతను, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link