స్టార్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత మృతి సంఘటనపై ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు డిఎంహెచ్వో తెలిపారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రి రికార్డులు, చికిత్స విధానం, విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది నుండి వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణలో మృతి చెందిన బాలింత బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిగా గుర్తించినట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీ మే 9, 2026న హైదరాబాద్‌లో స్కానింగ్ చేయించుకున్నట్లు, అనంతరం రాజమండ్రిలోని ఒక హోటల్‌లో ఉన్నట్లు సమాచారం లభించినట్లు చెప్పారు. అక్కడి నుండి పూర్తిస్థాయి గర్భధారణ కాలం నిండకముందే ఒక ఆర్.ఎం.పి డాక్టర్ సహకారంతో మే 16, 2026 రాత్రి తణుకులోని స్టార్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిసిందన్నారు. ఆసుపత్రికి వచ్చిన గంట వ్యవధిలోనే శస్త్రచికిత్స నిర్వహించి శిశువును బయటికి తీసిన అనంతరం, మే 17, 2026 ఉదయం బాలింత మృతి చెందినట్లు వెల్లడించారు. తదుపరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల బృందంతో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహ అవశేషాలను భద్రపరిచినట్లు తెలిపారు. అలాగే నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ప్రాథమిక విచారణలో వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం స్టార్ ఆసుపత్రి గత మూడు సంవత్సరాలుగా మూసివేయబడినట్లుగా నమోదై ఉన్నప్పటికీ, అనధికారికంగా కొంతమంది ఆర్.ఎం.పి డాక్టర్ల సహకారంతో కేసులు స్వీకరించి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం లభించినట్లు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాల సేకరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. వైద్య నిబంధనలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించినందున స్టార్ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. జి. గీతాబాయ్ తెలిపారు.



