కాలుష్య రహిత పుష్కరాల నిర్వహణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్

రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

శనివారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పుష్కర ఘాట్ వద్ద ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఈనెల 25న రాజమహేంద్రవరంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో కాలుష్య నిర్మూలన, పుష్కరాల నిర్వహణకు అవసరమైన చర్యలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.

ఆదివారం రాత్రి ఉపముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారని, సోమవారం ఉదయం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటు ద్వారా వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నల్లా ఛానల్‌ను కాలుష్య రహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా పరిశీలించనున్నారని చెప్పారు.

అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గోదావరి పుష్కరాల నిర్వహణపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గోదావరి పవిత్ర నది అయినప్పటికీ ప్రస్తుతం కాలుష్య సమస్య తీవ్రమవుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటే రాబోయే పుష్కరాలను ఆరోగ్యవంతంగా, పరిశుభ్రంగా నిర్వహించవచ్చన్నారు.

రాబోయే ఏడాది కాలాన్ని సద్వినియోగం చేసుకుని శాఖల మధ్య సమన్వయం, ప్రజాప్రతినిధుల సూచనలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కాలుష్య రహిత పుష్కరాల నిర్వహణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ పర్యటనలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link