సమిష్టికృషితో 2027 గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలి: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాల సన్నద్ధతపై తొలి ప్రాథమిక సమీక్ష

కుంభమేళా తరహాలో ‘టెంట్ సిటీలు’, ‘హోమ్ స్టే’ల ఏర్పాటుకు ప్రాధాన్యత

ఏ ఘాట్‌లో స్నానం చేసినా పుణ్యఫలం ఒకటే – భక్తులలో అవగాహన కల్పించాలని నిర్ణయం

రూ. 97 కోట్లతో ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’ పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడి

రాజమహేంద్రవరం: సమిష్టి కృషితో 2027 జూన్ 26న ప్రారంభమై 12 రోజులపాటు కొనసాగి జులై 7న ముగిసే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన ప్రాథమిక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జనవరి 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతిలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీకి అనుసంధానంగా ఈ రోజు జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, త్వరలోనే జిల్లా అధికారులతో పాటు హెచ్ వోడీలను కూడా భాగస్వామ్యం చేస్తూ పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పుష్కరాలపై సమగ్ర పర్యవేక్షణ తప్పనిసరి అని సూచించారు.

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టెంపుల్ సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవ జనార్ధన పారిజాతం (వైష్ణవ ఆలయాలు), ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందిస్తామన్నారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా ఇందులో భాగం చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు.

కోట్లాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో ‘టెంట్ సిటీలు’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ‘హోమ్ స్టే’ పాలసీని ప్రోత్సహిస్తున్నామని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని మండువా లోగిళ్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యఫలం లభిస్తుందని, ఒకే ఘాట్ వద్ద రద్దీ పెరగకుండా ప్రముఖ ప్రవచన కర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు ల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు.కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ క్రింద రూ. 97 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు పుష్కరాల నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇందులో భాగంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి, హేవలాక్ వంతెన ఆధునికీకరణ, బ్రిడ్జిలంక వద్ద వాటర్ స్పోర్ట్స్, కడియంలో ఎక్స్ పీరియన్స్ సెంటర్, నిడదవోలు కోటసత్తెమ్మ ఆలయ అభివృద్ధి, శెట్టిపేట వద్ద బోట్ షికారు పనులు వేగవంతం చేస్తామన్నారు. రోడ్ల కనెక్టివిటీ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు రూ. 1000 కోట్లకు పైగా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎస్పీ నరసింహ కిషోర్ కు తగిన సూచనలు చేస్తూ, పార్కింగ్ స్థలాల ఎంపికపై దృష్టి సారించాలన్నారు.

సమీక్షా సమావేశంలో ఎమెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, వేగుళ్ళ జోగేశ్వర రావు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఆర్డీవోలు రాజమహేంద్రవరం కే. భాస్కర్ రెడ్డి (ఇంచార్జి) , కొవ్వూరు రాణి సుస్మిత,కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link