రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఖాయం
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు
నియోజకవర్గ అభివృద్ధిలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ సహకారం
తణుకు నియోజకవర్గ బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతోనే తణుకు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో దేశ ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అమలు జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బరిలో నిలబడిన ప్రతి అభ్యర్థి గెలిపించేలా తణుకు నియోజకవర్గం నుంచి నాంది పలకాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తణుకు నియోజకవర్గానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ఇటీవల సర్కారు ఎక్స్‌ప్రెస్‌ను అత్తిలి రైల్వే స్టేషన్‌లో హాల్టు ఇచ్చేలా ఆయన చేసిన కృషిని అభినందించారు. తణుకు డిగ్రీ కళాశాల ఆవరణలో సింథటిక్ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ. 30 లక్షలు, ఇరగవరం మండలం అగ్గిరాయిచెవురు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ. 25 లక్షలు, అత్తిలి డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి రూ. 70 లక్షలు చొప్పున ఎంపీ నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మరో రూ. 3.75 కోట్లు ప్రతిపాదనల దశలో ఉన్నాయని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సహకరిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


