డి.ముప్పవరంలో రూ. 20 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభం
నిర్మాణంలో ఉన్న బీసీ కమ్యూనిటీ హాల్ పనుల పరిశీలన
మహిళలు, బీసీల ఆర్థిక ప్రగతియే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడి
నిడదవోలు (అక్షరభూమి)
నిడదవోలు: కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి,మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు రూరల్ మండలం డి.ముప్పవరం గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తొలుత పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో డి.ముప్పవరం గ్రామంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘాల సమాఖ్య భవనాన్ని మంత్రి దుర్గేష్ కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించి, డ్వాక్రా మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల ఉపాధికి, ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తోందని తెలిపారు. అనంతరం అదే గ్రామంలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీసీ కమ్యూనిటీ హాల్ పనులను మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బీసీలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా మంత్రి స్థానిక చెరువును సందర్శించారు. చెరువు పరిస్థితిని గమనించి, దాని ఆధునికీకరణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


