జగన్ మోహన్ రెడ్డి చేయాల్సింది పరామర్శలు కాదు ప్రాయశ్చిత్త దీక్షలు

జగన్ పర్యటనలు ‘పరామర్శ’ కోసం కాదు, చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే

మంత్రి కందుల దుర్గేష్ ధ్వజం

అమరావతి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటనలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ చేస్తున్నవి పరామర్శ యాత్రలు కావని, గత ఐదేళ్లలో చేసిన అరాచకాలకు ‘ప్రాయశ్చిత్త దీక్షలు’ చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన తప్పులు, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యాత్రలు చేస్తున్నారని మంత్రి దుర్గేష్ విమర్శించారు. ఇది పక్కా డైవర్షన్ పాలిటిక్స్ అని స్పష్టం చేశారు. రోడ్లు క్లియర్ గా ఉన్నప్పటికీ, కేవలం 20 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల పాటు నెమ్మదిగా ప్రయాణించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా, కృత్రిమమైన హడావుడి సృష్టించే ప్రయత్నమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అడ్డగోలుగా, అసభ్యకరంగా మాట్లాడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సింది పోయి, వారికే పరామర్శలు చేస్తూ జగన్ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని మంత్రి దుర్గేష్ ఆరోపించారు. ఇటువంటి చర్యల ద్వారా వైసీపీ నాయకత్వం సమాజంలో అసభ్యకర భాషను, అరాచక సంస్కృతిని ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. పరామర్శల పేరుతో రాష్ట్రంలో అశాంతిని, అరాచకాలను సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. “డబ్బులు ఇచ్చి జనాలను తరలిస్తూ షో చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ దాడులను ప్రోత్సహించరు, కానీ జగన్ ఎప్పుడూ మంచిని ప్రోత్సహించరు అనేది స్పష్టమవుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ఎన్ని డ్రామాలు ఆడినా, ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. “ఏం చేసినా వైసీపీ జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాదు. ప్రజలు వారి పాలనలోని చీకటి రోజులను ఇంకా మర్చిపోలేదు” అని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించారు.

Scroll to Top
Share via
Copy link