తణుకు : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు యర్రమిల్లి నరసింహారావు స్వరాజ్య ఉద్యమంలో యువజనోద్యమంతో ప్రారంభించి గాంధీజీ నాయకత్వంలో సాగిన జాతీయోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారని శ్లాఘిస్తూ పలువురు పురప్రముఖులు సమరయోధుల పార్కు లోని అయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు,
దారి దీపం సంపాదకులు డి.వి. వి.యస్.వర్మ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ సారథ్యంలో ఏర్పడిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా తదనంతరం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ అనుచరుడిగా సోషలిస్టు భావాల వ్యాప్తికి విశేషమైన కృషిచేశారని, అల్లూరి సీతారామ రాజు పైన ప్రకాశం పంతులుగారి మీద ప్రామాణికమైన రచనలు చేశారని కొనియాడారు.
ఆయన కుమార్తె విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయోద్యమంలోని దేశ ఐక్యత, మతసామరస్యం వంటి విలువలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొవ్వలి ఆంజనేయ శర్మ మాట్లాడుతూ జాతీయోద్యమంలో తమ కుటుంబపెద్దలతో యర్రమిల్లి నరసింహారావు సాగించిన ఉద్యమ కార్యకలాపాలను వివరించారు.
ప్రముఖకవి సుశర్మ కు సన్మానం
అనంతరం ప్రముఖకవి సుశర్మ ను యర్రమిల్లి ప్రభాకరరావు, విజయలక్ష్మి సత్కరించారు. కె.వి.ఆంజనేయులు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో
సమరయోధుల కుటుంబాలసభ్యులు సంకు మనోరమ, భూపతిరాజు ఝాన్సీ, లుముంబాలతోపాటు పురప్రముఖులు నందిగం సుధాకర్, కరుణాకర చౌదరి, గుమ్మళ్ళ హనుమంతు, కాశీపతి, చీకటి శ్రీనివాసరావు, బెల్లంకొండ బుచ్చిబాబు, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, ఎ. భాస్కరరావు, కోట రాంప్రసాద్, డా. రఘు, జి. సీతారామరాజు, గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


