మొంథా తుఫాన్ వల్ల గత రెండు రోజులుగా ఉండ్రాజవరం మండలంలో కురుస్తున్న వర్షాలకు ఈదురు గాలులకు నేలవారిన వరి పొలాలను బుధవారం మంత్రి కందుల దుర్గేష్ సందర్శించి రైతులకు అండగా ఉంటామని పంట నష్టపోయిన ప్రతీ ఒక్క రైతుకు సాయం అందేలా కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. ఉండ్రాజవరం మండలంలో 4710 హెక్టార్లలో వరి సాగు అవుతుండగా 1472 హెక్టార్లలో పంట నేల వాలింది అని ప్రస్తుతం గింజగట్టి పడే దశ నుండి వారం పదిరోజులలో కోతకు వచ్చే దశలో ఉండటం వల్ల గింజ మొలకెత్తి, రంగు మారే అవకాశం ఉందని తెలిపారు. దీనిని కొంతవరకు అరికట్టడానికి వ్యవసాయశాఖ సూచనలు పాటించాలని కోరారు. నేలకు ఒరిగి తడిచిన పైరుపై అవకాశం ఉన్నట్లయితే 5శాతం ఉప్పు ద్రావణాన్ని స్ప్రే చెయ్యాలి అని తద్వారా గింజ మొలకెత్తకుండా మరియు రంగు మారకుండా ఉంటుందని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. వీలయినంత వరకు పడిన దుబ్బులని నిలబెట్టడానికి ప్రయత్నించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సి.హేచ్. లక్ష్మి, కాల్ధారి సహకార సొసైటీ అధ్యక్షులు కొమట్లపల్లి రామదాసు, మాజీ జడ్పీటీసి, ఏ.పి.పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కోమట్లపల్లి సుబ్బారావు, విశ్వనాథం, తహసీల్దార్ పి.ఎన్.డి. ప్రసాద్, ఎంపిడిఓ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.


