పచ్చి కొబ్బరికాయలకు మునుపెన్నడూ లేనంతగా ధర వచ్చింది. కోనసీమ మార్కెట్ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. మూడు రోజుల క్రితం వరకు వెయ్యి కాయల ధర రూ.22 వేలు ఉండగా ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.24 వేలకు చేరింది. ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చికాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో కాయల పరిమాణం ఆశాజనకంగా ఉంటుంది. వచ్చే నెలలో బాగా తగ్గిపోయి చిన్నవి వస్తాయి. దీంతో వర్తకులు రైతుల వద్ద నుంచి ఇప్పుడే పెద్దఎత్తున కొని నిల్వ చేసుకుంటున్నారు. రానున్న దసరాకు మంచి ధర వస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు దిగుబడులు సన్నగిల్లాయి. గతంలో ఎకరాకు వెయ్యి కాయలు వస్తే ఇప్పుడు సగానికి తగ్గిపోయి కొరత ఏర్పడింది. దీంతో రోజుల వ్యవధిలోనే ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు ఎగుమతులు జోరందుకున్నాయి.


