అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలని తక్షణం అమలు చేయాలని. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా పూర్వపు కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా విడిపోయిన అనంతరం ఈనెల 8వ తేదీన ప్రముఖ చేనేత కేంద్రం పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో వీవర్స్ కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత వృత్తిని నమ్ముకుని నేటికీ రెండు లక్షల మగ్గాలపై పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్న చేనేత కార్మికులను ఆదుకోవలసిన పాలక ప్రభుత్వాలు చేనేత వృత్తిని. చేనేత సహకార వ్యవస్థను దెబ్బతీస్తూ పవర్ లూమ్ యజమానులకు కోట్లు రూపాయలు రాయితీలు ఇస్తూ వారిని ప్రోత్సహించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తమకు అధికారం కోసం చేనేత కార్మికులను ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అనేక హామీలు ఇస్తున్నారని అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని విస్మరించడం తగదని వీరభద్రరావు అన్నారు. కాబట్టి చేనేత పరిశ్రమ. వృత్తి పరిరక్షణకు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందించేందుకు ఈ జిల్లా మహాసభ వేదిక కానున్నదని ఆయన తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లా మహాసభకు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ తో పాటు జిల్లా నాయకులు హాజరవుతున్నారాని కాబట్టి జిల్లా నలుమూలల నుండి చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు.


