జియోట్యాగ్ ఫోన్లకు ఏర్పాటు చేసి, పలు రకాల యాప్లు ఇచ్చి ఉదయం నుండి రాత్రి వరకు పనులు చేయిస్తున్న ఐకెపి వివో ఏల సమస్యలు పరిష్కరించాలని ఇరగవరం మండల వివో ఏల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఇరగవరం వెలుగు మండల సమాఖ్యే కార్యాలయంలో పిల్లి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్మార్ట్ ఫోన్లు ఇచ్చి కార్మికులను కట్టు బానిసలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయిస్తున్నదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా కార్మికులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు, తిండి గింజలు, ఇల్లు,విద్య, వైద్యం వంటి మౌలిక పలు అవసరాలు ప్రతి కుటుంబానికి హక్కుగా అందజేయాలని దానికోసమే సిఐటియు పోరాడుతుందని అన్నారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారంతోపాటు కనీస వేతనం అమలు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు నాగిశెట్టి గంగారావు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత సంఘానికి బలం అని ఐక్యంగా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలి అన్నారు. ప్రభుత్వం చెల్లించే వేతనం అధికారుల సమావేశాలకు, స్మార్ట్ ఫోన్లు రీఛార్జిల కోసం ఖర్చు పెడుతున్నారని, కార్మికుల వేతనం ఇంటికి వెళ్లడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో వివోఏల జిల్లా నాయకులు గడ్డం లక్ష్మి మరియు మండలంలోని పలువురు వివోఏలు పాల్గొన్నారు.


