చంద్రబాబు హయాంలోనే మహిళలకు పెద్ద పీట
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి
ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు
స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపు తీసుకువచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లనే అని అదే ఒరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ మహిళ అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను తణుకులో కమ్మ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 90 శాతం హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిలో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు. అప్పటివరకు ఇంట్లో ఉండే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో రూ. 2 కే బియ్యాన్ని నందమూరి తాకరామారావు ప్రవేశపెట్టాలని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మహిళలకు డ్వాక్రా సంఘాల పేరుతో మహిళ అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాని దేనని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తూ దేశంలోనే రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చారని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయంగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన నిలిచిందని చెప్పారు. ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి మోసకారి సంక్షేమాన్ని అమలు చేశారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ప్రజల ఖాతాలో డబ్బులు జమ చేసి మళ్లీ తిరిగి వెనక్కి లాక్కునే వారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేయడంతోనే రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. ఐదేళ్లపాటు మద్యం వ్యాపారం చేసిన జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం ద్వారా దాదాపు రూ. 3500 కోట్లు అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. మహిళలకు అవకాశాలు ఇవ్వడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మహిళ అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. అనంతరం తణుకు నియోజకవర్గంలోని 453 స్వయం సహాయక సంఘాలకు ర. 41.03 కోట్లు బ్యాంకు రుణాలు, స్త్రీ నిధి, ఉన్నతి రుణాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రోజా రమణి, తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సిరిగినీడి రాజ్యలక్ష్మి, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళ దేవి, అత్తిలి, తణుకు ఏఎంసీ చైర్మన్లు దాసం ప్రసాద్, కొండేటి శివ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


