సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు ఉపయోగపడే పథకాల ద్వారా శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే ఆలోచనలను చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పదవి స్వీకారం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా తాము సంవత్సర కాలంగా చేసిన పనులు ఆనందాన్ని నింపుతున్నాయన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఏడాది కాలంలోనే రోడ్ల విషయంలో తాము విజయం సాధించామన్నారు. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వమని అభివర్ణించారు. ప్రజల అవసరాలు గుర్తించి ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గాన్ని శేషారావుతో కలిసి సర్వతోముఖాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలు అద్భుత నియోజకవర్గంగా రూపుదిద్దుకునేందుకు అన్ని అవకాశాలున్నాయన్నారు. కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పెన్షన్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, కొత్త పెన్షన్లు అందిస్తామన్నారు. దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. కుటుంబంలో ఎంత మంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం స్కీమ్ వర్తించేలా చేస్తామని సీఎం చెప్పినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు, ఇతరత్రా అంశాల్లో కేంద్రం సహకారం మెండుగా ఉందన్నారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలు
స్థానికంగా ప్రజలంతా చర్చించుకొని తమ గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి ఏం కావాలో నిర్దారించుకొని ప్రభుత్వానికి పంపించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. వాటినే ప్రణాళికలుగా ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు.గొప్ప విజనరీగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ప్రజల ఆలోచనల నుండి ప్రణాళికలు తయారుచేసే ప్రభుత్వాన్ని ప్రస్తుతం చూస్తున్నామన్నారు. ఇప్పటికే వివరాలు సేకరించామన్నారు.
కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాల కూటమి పార్టీల అధ్యక్షులు, సర్పంచ్ లు, అధికారులు, ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

