గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఖండవల్లి గ్రామంలో కొత్త రోడ్లు వేయకపోగా పాత రోడ్లు మరమ్మత్తుకు నోచుకోలేక వాహనదారులు ప్రమాదాల బారిన పడిన దుర్భర పరిస్థితులు చూశామని మంత్రి దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అధ్వాన్న రోడ్లు దర్శనమిస్తున్నా తట్టెడు మట్టి కూడా వేయలేని దౌర్భాగ్య స్థితికి ఆ గుంతల రోడ్లే నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చించి నియోజకవర్గంలో ఇప్పటివరకు కేవలం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రిందే దాదాపు రూ.31 కోట్లు ఖర్చు చేసి రోడ్లను వేశామన్నారు. లింకు రోడ్లను సీసీ రోడ్లుగా మార్చామన్నారు. ఇప్పటికే చాలా రోడ్లు ప్రారంభించామని, రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. పట్టణంలో, ఇతరత్రా మండలాల్లో మరిన్ని లింకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ని ఖండవల్లికి చెందిన గ్రామస్థులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఖండవల్లి గ్రామాల్లో పుంత రోడ్లు, డ్రైనేజీలు కావాలని ప్రజలు కోరారన్నారు. త్వరలోనే డ్రైనేజీలు బాగు చేస్తామన్నారు. టిడ్కో, ఎన్టీఆర్ గృహ నిర్మాణాల అంశాలపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి నీరును నిడదవోలుకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. విజ్జేశ్వరం దగ్గర గ్రిడ్ ఏర్పాటు చేసి తద్వారా గ్రామగ్రామానికి మంచినీళ్లు ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులు దుబారా చేసిందన్నారు.
ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఖండవల్లి గ్రామం నందు రూ. 68.50 లక్షల అంచనా వ్యయంతో ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మిస్తోన్న “పంచాయతీరాజ్ రోడ్డు” ప్రారంభోత్సవంతో పాటు మరో నూతన రోడ్డు నిర్మాణనికి మంత్రి దుర్గేష్ శంకుస్థాపన చేసారు.


