రూ.1.45 కోట్ల విలువైన 1345 గజాల స్థలం మున్సిపాలిటీకి బహుకరించినందుకు అభినందించిన మంత్రి కందుల దుర్గేష్
సంబంధిత డాక్యుమెంట్లు అందుకున్న మంత్రి కందుల దుర్గేష్
త్వరితగతిన గాంధీ నగర్ రోడ్డు నెంబర్ 1 నుండి మూలకోడు చెరువు వరకు రోడ్డు వేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం
త్వరలోనే మురుగునీటి శుద్ధి కర్మాగారం..ఇందిరా నగర్ కు రోడ్డు వేసేందుకు చర్యలు
సమాజంలో స్వచ్ఛంధ సంస్థలు, పౌర సమాజాలది కీలక పాత్ర అని పేర్కొన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ క్రింద సమాజానికి ఉపయోగపడే బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిన శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల, లయన్స్ క్లబ్ యాజమాన్యాన్ని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. బుధవారం నిడదవోలులోని శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల, లయన్స్ క్లబ్ ల ఆర్థిక సహకారంతో గాంధీ నగర్ రోడ్డు నెంబర్ 1 నుండి మూలకోడు చెరువు వరకు రోడ్డు వేసేందుకు కావలసిన స్థలాన్ని నిడదవోలు మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సంబంధిత స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు యాజమాన్యం నుండి అందుకున్నారు. శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ సంస్థలు రూ.1.45 కోట్లతో 1345 గజాల స్థలాన్ని కొని రోడ్లు, ఇతర మౌలిక సదుపాయల ఏర్పాటు, సుందరీకరణ పనుల కోసం మునిసిపాలిటీకి బహుమతిగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ స్వచ్ఛంధ సంస్థలు, పౌర సమాజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా “మార్గదర్శి- బంగారు కుటుంబం” పేరిట కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో భాగంగా స్పందించిన శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ నిడదవోలు ఛైర్మన్ కొత్తపల్లి రవికుమార్ ను, బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తాము పుట్టిన ప్రాంతం అందంగా ఉండాలి, అభివృద్ధి పథంలో ఉండాలన్న ఉద్దేశంతో స్థలం వితరణ చేయడం గొప్ప విషయమన్నారు. గొప్ప ఆలోచనకు మంత్రి హ్యాట్సాఫ్ తెలిపారు. ప్రభుత్వానికి అండగా లయన్స్ నేత్ర వైద్యశాల, లయన్స్ క్లబ్ మాదిరిగా మరిన్ని సంస్థలు ముందుకొస్తే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్(పీ4) విధానాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. సమాజం సమసమాజంగా ఉండాలన్న ఉద్దేశంతో సమాజంలో పేద వర్గాలు, అవసరమున్న వర్గాలకు మార్గదర్శకులుగా పిలువబడే ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఆదుకోవాలన్న సదుద్దేశంతో తెచ్చిన విధానం సత్ఫలితాలిస్తోందన్నారు. రవికుమార్ మార్గదర్శిగా బంగారు కుటుంబం లాంటి ప్రాంతాన్ని సుందరీకరణ నిమిత్తం వితరణ చేసినందుకు కూటమి ప్రభుత్వం తరపున అభినందిస్తున్నానన్నారు. పురపాలక సంఘం త్వరితగతిన రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
త్వరలోనే మురుగునీటి శుద్ధి కర్మాగారం (సేవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) వస్తుందని, ఇందిరానగర్ కు రోడ్డు నిర్మించనున్నామన్నారు. తద్వారా ఇందిరానగర్ లో స్థానికంగా ఉన్న 60 శాతం మురుగునీరును శుద్ధిచేసి బాగు చేస్తామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు అన్న వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న 10శాతం మంది అట్టడుగునున్న 20 శాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని మంత్రి దుర్గేష్ కోరారు. సమాజంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ ఛైర్మన్ షేక్ వజీరుద్ధీన్, కౌన్సిలర్లు, నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టి.ఎల్.పి.ఎస్.ఎన్. కృష్ణవేణి, కొవ్వూరు డివిజన్ ఆర్డీవో రాణి సుస్మిత, శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల ఛైర్మన్ కొత్తపల్లి రవికుమార్, లయన్స్ క్లబ్ నిడదవోలు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.


