తణుకులో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర నీరుల్లి పచ్చిమిర్చి కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆరు డస్ట్ బీన్స్ తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఈ బిన్లలో వేయడం ద్వారా ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బంది వాటిని సేకరించి తరలించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.గత ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌ను సందర్శించిన సందర్భంగా ప్రారంభించిన బయో ఫెర్టిలైజర్ యూనిట్ ప్రస్తుతం విజయవంతంగా పనిచేస్తోందన్నారు. ఈ యూనిట్ ద్వారా ప్రతిరోజూ సుమారు 150 కిలోల కూరగాయల వ్యర్థాలు, నెలకు సుమారు 4.5 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఆదర్శవంతమైన చర్యగా పేర్కొన్నారు.హోల్‌సేల్ మార్కెట్ సంఘం సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ సంఘం ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వ్యాపారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



