గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 వేదికగా అవార్డు అందుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
అవార్డు నాకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపు.. మంత్రి దుర్గేష్ భావోద్వేగం
సీఎం విజన్.. డిప్యూటీ సీఎం ఆలోచనలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన మంత్రి కందుల దుర్గేష్
కూటమి ప్రభుత్వ వినూత్న సంస్కరణలు, మంత్రి దుర్గేష్ ‘మార్కెటింగ్ స్ట్రాటజీ’ సూపర్ హిట్..కేరళం వేదికగా ఘనసత్కారం లభించిందని హర్షం
టెంపుల్ టూరిజం నుండి మల్టీ-ఎక్స్పీరియన్స్ గ్రిడ్ వైపు.. ఏపీ టూరిజంలో విప్లవాత్మక మార్పులు!
వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ‘GTM 2027’కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్..2027 సెప్టెంబర్ 27న ఏపీలో గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఎక్స్ పో నిర్వహణ
‘సరికొత్త ఆలోచనలతో రండి.. పెట్టుబడులు పెట్టండి.. మీకు అండగా మేముంటాం’ అని జీటీఎం వేదికగా పెట్టుబడులకు మంత్రి దుర్గేష్ ఆహ్వానం
అమరావతి/తిరువనంతపురం (కేరళం): ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని అపారమైన పర్యాటక వనరులను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో కూటమి ప్రభుత్వం చూపిన అసాధారణ ప్రతిభకు గానూ దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన ‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్-2026’ఆంధ్రప్రదేశ్‌ను “బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్”గా ఎంపిక చేసింది. కేరళలోని కోవాలం ‘లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్’లో జరిగిన ప్రతిష్టాత్మక బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-కన్స్యూమర్ పర్యాటక వేదికపై, దేశవిదేశాల ప్రముఖుల సమక్షంలో కేరళం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి పి.సి. విశ్వనాథ్, ఎమ్మెల్యే మురళీధరన్, త్రివేండ్రం మేయర్ వి.వి.రాజేష్ ల చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును సంతోషంగా స్వీకరించారు. ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండో రోజు కేరళం పర్యటనలో భాగంగా అవార్డు స్వీకరించిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ భావోద్వేగంతో మాట్లాడుతూ… “తిరువనంతపురం వేదికగా ఈ అరుదైన పురస్కారాన్ని అందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపును అందించిన నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవార్డును నేను ఒక వ్యక్తిగత గౌరవంగా కాకుండా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మా పర్యాటక భాగస్వాములు మరియు ఏపీ ప్రజలు అందరూ కలిసి చేసిన సంయుక్త కృషికి దక్కిన గౌరవంగా భావించి స్వీకరిస్తున్నాను.
సీఎం చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించడంతో పాటు, నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా ఇన్వెస్టర్లకు క్యాపిటల్ సబ్సిడీలు, 100% ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇస్తూ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు పెద్దపీట వేశారు. పీపీపీ విధానంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ 7 యాంకర్ పర్యాటక హబ్‌లతో పాటు 25కు పైగా థీమాటిక్ సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నాం. ‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్యంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే మా సంకల్పం..భారతదేశ పర్యాటక వృద్ధి కథనంలో ఆంధ్రప్రదేశ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతోందనే నమ్మకాన్ని ఈ సత్కారం మరింత బలోపేతం చేసింది” అన్నారు.పర్యాటకం అనేది కేవలం ప్రయాణం మాత్రమే కాదని.. అది సమాజంలోని కళాకారుల నుండి వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరికీ ఉపాధిని, జీవనోపాధిని కల్పించే ఒక ఆర్థిక వృద్ధి ఇంజిన్ అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు.
GTM వేదికపై పెట్టుబడులకు పిలుపు – ‘GTM 2027’ ఏపీలోనే!
అంతకుముందు, ‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026’ ఎగ్జిబిషన్‌ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్టాల్‌ను ప్రారంభించి, పర్యాటక విశేషాల బ్రోచర్లను స్వయంగా పంపిణీ చేశారు. ఇంటర్నేషనల్ టూర్ ఆపరేటర్లతో ముఖాముఖి చర్చించి, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల పర్యాటకులను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించడం కోసం నిర్వహిస్తున్న ‘హాలిడే ఇన్ ఏపీ’ క్యాంపెయిన్‌ను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక వృద్ధిని చూసి ప్రభావితమైన నిర్వాహకులు వచ్చే ఏడాది (సెప్టెంబర్ 27, 2027) వరల్డ్ టూరిజం డే సందర్భంగా ‘GTM 2027’ ఎక్స్ పోను ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మంత్రి దుర్గేష్..ఏపీలో వెల్ నెస్, క్రూయిజ్ టూరిజం లో ఇన్వెస్ట్ చేయండి.. ఇదే బెస్ట్ టైమ్ అని పిలుపునిచ్చారు. తద్వారా ఇన్వెస్టర్లు బెనిఫిట్ అవుతారని చెప్పారు. బీచ్, టెంపుల్స్, రివర్, బ్యాక్ వాటర్స్, వైల్డ్ లైఫ్, ఎకో, అడ్వెంచర్, క్రూజ్, కల్నరీ, కల్చర్, వెల్ నెస్ , హెరిటేజ్, బుద్ధిస్ట్ టూరిజం.. ఇలా ఒక్కటేమిటి భారతదేశంలోని ప్రతి అద్భుత దృశ్యం ఏపీలోనే ఉందని, ‘సరికొత్త ఆలోచనలతో రండి.. పెట్టుబడులు పెట్టండి.. మీకు అండగా మేముంటాం’ అని జీటీఎం వేదికగా టూర్ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లను మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు.
ఏపీ ఒక సంపూర్ణ పర్యాటక ప్యాకేజీ:మంత్రి కందుల దుర్గేష్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, అత్యధికులు దర్శించే ఆధ్యాత్మిక క్షేత్రం ‘తిరుమల’తో పాటు 80 వేలకు పైగా దేవాలయాలకు నిలయం ఏపీ అని, 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (వైల్డ్ లైఫ్ శాంచ్యురీలు), 3 జాతీయ పార్కులు, దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ (నాగార్జునసాగర్-శ్రీశైలం) మరియు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మడ అడవుల (మ్యాంగ్రోవ్స్) తీరప్రాంతం తమ సొంతమన్నారు. చారిత్రక లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం, తిరుమల కొండలు మరియు విశాఖలోని అరుదైన ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో స్థానం సంపాదించాయన్నారు.స్వదేశీ పర్యాటకుల సందర్శనలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్నామని, 1,054 కిలోమీటర్లతో భారతదేశంలోనే 3వ అతిపెద్ద తీరప్రాంతం, పర్యాటకానికి అనువైన 283 అద్భుతమైన బీచ్‌లు ఏపీ సొంతమని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.కడప జిల్లాలోని గండికోట ‘ఇండియాస్ గ్రాండ్ కాన్యన్’గా ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, అద్భుతమైన పడవ ప్రయాణాలకు, ప్రకృతి అందాలకు నిలయమైన బ్యాక్‌వాటర్ వనరులలో దేశంలోనే 2వ స్థానంలో ఏపీ ఉందని గణాంకాలతో సహా వివరించారు.
300కు పైగా ఎగ్జిబిటర్లు, 1,000 మందికి పైగా బయ్యర్లు ఒకే చోట చేరిన జీటీఎం 2026 సదస్సు కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, ఇది సరికొత్త ఆవిష్కరణలకు, ఆర్థిక వృద్ధికి మరియు పరస్పర అనుసంధానానికి ఒక ప్రధాన చోదక శక్తి గా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు పర్యాటక రంగంలో కళ్లు చెదిరే మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు..2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలను నమోదు చేసి సుస్థిర వృద్ధిని సాధించిందని, దేశీయ పర్యాటకంలో ఏపీ ఇప్పటికే దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతుండగా.. అంతర్జాతీయ పర్యాటకుల రాకలో ఏకంగా 48% పైగా స్పష్టమైన వృద్ధి నమోదైందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం సందర్శించే స్థలం కాదు.. అదొక అద్భుతమైన అనుభూతి. ఇక్కడ ప్రతి ప్రయాణం ఒక కథను చెబుతుంది, ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడు ఆ కథలో ఒక భాగమవుతాడు అనే స్ఫూర్తిదాయకమైన మాటలతో మంత్రి దుర్గేష్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఏపీ టూరిజాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన ఘనత మంత్రి కందుల దుర్గేష్ ది:ప్రతినిధులు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంత్రి కందుల దుర్గేష్’బ్రాండ్ ఏపీ’ పేరుతో సోషల్ మీడియా, అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్స్‌పై డిజిటల్ బ్రాండింగ్ సరికొత్తగా డిజైన్ చేశారని ప్రతినిధులు కొనియాడారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, ఢిల్లీలలో రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్.. చెన్నై, కోల్‌కతా,ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లలో రోడ్ షోలు నిర్వహించడంతో పాటు బెర్లిన్, లండన్ వంటి అంతర్జాతీయ వేదికలపై ఏపీ పర్యాటక వాణిని బలంగా వినిపించారని అవి తమను ఆకర్షించాయన్నారు. కేవలం టెంపుల్ టూరిజానికే పరిమితం కాకుండా ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్, బీచ్, క్రూయిజ్, రివర్, కల్చర్, మెడికల్ టూరిజంలను ప్రోత్సహించారని పేర్కొన్నారు. సీప్లేన్ సర్క్యూట్లు, వాటర్ స్పోర్ట్స్, కారవాన్ టూరిజం, లగ్జరీ టెంట్ సిటీలు, హోమ్ స్టేలను అందుబాటులోకి తెచ్చి ఏపీ టూరిజాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన ఘనత మంత్రి దుర్గేష్ కు దక్కుతుందన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగా స్థానిక కళలు, వంటకాలు, హస్తకళలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ పర్యాటకాన్ని బలోపేతం చేయడం ద్వారా స్థానిక జనసమూహాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం, ఏడాదంత పర్యాటక శోభ ఉండేలా పర్యాటక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆయన పనితీరుకు నిదర్శనమని కొనియాడారు..ముఖ్యంగా సీఎం విజన్‌ను, డిప్యూటీ సీఎం ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో మంత్రి కందుల దుర్గేష్ విజయవంతం అయ్యారని వారు తెలిపారు. ఈ క్రమంలో కేవలం 24 నెలల కాలంలోనే ఒబెరాయ్, తాజ్, ఎట్మోస్పియర్ కోర్, రాడిసన్ బ్లూ, నోవాటెల్, మేఫేర్, ఫెమా, జీఆర్టీ, ఐటీసీ, సరోవర్, దస్పల్లా, ఫార్య్చూన్, మారియట్, వివంత, హిల్టన్, లెమన్ ట్రీ. హయత్, కల్ట్ మహీంద్ర తదితర ప్రఖ్యాత 117 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుని, రాష్ట్రానికి దాదాపు రూ.20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, దాదాపు 8 పర్యాటక ప్రాజెక్టులకు గానూ రూ.430 కోట్ల కేంద్ర నిధులను సాధించడమేగాక పర్యాటక రంగాన్ని ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రధాన ఇంజిన్‌గా మార్చడం, పలు పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించడం వంటి అంశాలు పురస్కారం వచ్చేందుకు కారణమయ్యాయని నిర్వాహకులు తెలిపారు. అతి తక్కువ కాలంలోనే లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు రాష్ట్ర పర్యాటక రంగానికి ఒక ‘స్వర్ణయుగం’గా నిలుస్తుంది.



