తణుకు రోడ్ రన్ పేరుతో మారథాన్
డిసెంబర్ 7న తణుకులో ఏర్పాట్లు
పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు రోడ్ రన్ రెండో ఎడిషన్ పేరుతో డిసెంబర్ 7న తణుకులో మారథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం తణుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దేశంలో మహానగరాల్లో నిర్వహిస్తున్న మారథాన్‌లు అనుసరిస్తూ తణుకు పట్టణంలో సైతం 3, 5, 10 కిలో మీటర్లు చొప్పున పరుగు నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు. శారీరక ధారుఢ్యంపై యువతో ఉత్సాహాన్ని నింపేందుకు గత ఏడాది నుంచి రోడ్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా డిసెంబరులో మొదటి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడానికి సొసైటీ ఏర్పాటు చేశామన్నారు. గతంలో 1200 మంది పాల్గొన్నారని ఈ సారి 2 వేల మందికి పైగా పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 7న ఉదయం 5.30 గంటలకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. యువత, వ్యాపారస్తులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం తణుకు రోడ్ రన్ వెబ్‌సైట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విశ్వతేజ్, కిరణ్, దీప్తి, తణుకు మున్సిపల్ మాజీ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, టిడిపి తణుకు పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, కూటమి నాయకులు పాల్గొన్నారు.



