రహదారుల అభివృద్ధికి ఏడాదిలోనే రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు

ఆర్‌అండ్‌బీ శాఖను గత వైసీపీ నిర్వీర్యం చేసింది

అత్తిలి మండలంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి

ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి పర్యటించిన మంత్రి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఒక ఏడాదిలోనే రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మంజూరు చేసిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. శనివారం అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామంలో పర్యటించిన మంత్రి జనార్థన్‌రెడ్డి రూ. 3 కోట్లు నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి పర్యటించిన మంత్రి జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌బీ శాఖను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత అయిదేళ్ల వైసీపీ పాలనలో కనీసం రోడ్డు మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతల రహిత రహదారుల లక్ష్యంగా రూ. వెయ్యి కోట్లుతో 23 వేల కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉరదాళ్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ప్రకటించిన అప్పటి మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఏనాడు గ్రామం మొహం చూడలేదని ఎద్దేవా చేశారు. ఆనాడు కేవలం మాటల ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం నిలిచిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని నిరూపించి ఆనాడు నిర్లక్ష్యానికి గురైన ఉరదాళ్లపాలెం గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో రూ. 26.84 కోట్లు నిధులతో రోడ్లు నిర్మాణాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link